దళిత సమస్యలపై డిసెంబర్‌ 4న పార్లమెంట్‌ మార్చ్‌

On Dalit issues Parliament march on December 4– దేశవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ
– వ్యవసాయ కార్మిక, దళిత సంఘాల నేతల పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్య లపై డిసెంబర్‌ 4న పార్లమెంట్‌ మార్చ్‌కు వ్యవసాయ కార్మిక, దళిత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. హైదరా బాద్‌లో ఆగస్టు 26, 27తేదీల్లో జరిగిన నేషనల్‌ దళిత్‌ సమ్మిట్‌ రూపొందించిన మ్యానిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరిస్తా మన్నారు. అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వ హించాలని అన్నారు. శనివారం నాడిక్కడ ఏఐఏడబ్ల్యూయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నేతలు దళిత్‌ సమ్మిట్‌ అమోదించిన డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. విజయరాఘవన్‌, బి.వెంకట్‌, దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ ఉపాధ్యక్షురాలు సుభాషిణి అలీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని ప్రతి రంగంలో దళితులపై జరుగుతున్న దాడులను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమైన అంశంగా లేవనెత్తుతామని తెలిపారు. సంక్షేమ పథకాలను ధ్వంసం చేస్తూ ప్రయివేటీకరణ విధానాల అమలు వేగాన్ని పెంచిన మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలు దళిత వర్గాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. దేశంలో వ్యవసాయ కూలీల్లో 60 శాతం మంది దళితులేనని, భూమిలేని వ్యవసాయ కార్మికులను మోడీ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని అన్నారు. ఉపాధి హామీ పథకానికి ఆటంకం కలిగిస్తున్నదని, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్ల ఉన్నత విద్యారంగంలో దళిత విద్యార్థులు తీవ్ర వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని విమర్శించారు. దళితులు, ఇతర పేద వర్గాలకు నూతన జాతీయ విద్యా విధానం విద్యావకాశాలను మరింత దూరం చేస్తుందని, మనువాదం, హిందూయిజంపై ఆధారపడిన బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపు నిచ్చారు. దేశంలోని దళితుల డిమాండ్లను ఉమ్మడి ఎజెండాగా రూపొందిం చాలని కూడా హైదరాబాద్‌ సదస్సు నిర్ణయించిందన్నారు. కుల గణన కోసం డిమాండ్‌ బలంగా పెరుగుతుందని, మిగులు భూమిని దళితులకు పంచాలని డిమాండ్‌ చేశారు. దళితులకు కేటాయించిన భూమిలో ఆక్రమణలపై విచారణ జరిపి రికవరీ చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కమిషన్‌ను నియమించాలని నాయకులు డిమాండ్‌ చేశారు.
విలేఖరుల సమావేశంలో డీఎస్‌ఎంఎం ప్రధాన కార్యదర్శి రామచంద్రడోమ్‌, గుల్జార్‌ సింగ్‌ గోరియా (బీకేఎంయూ), ఎన్‌. సాయి బాలాజీ (ఏఐఏఆర్‌ఎల్‌ఏ), రామ్‌ మూర్తి (ఏఐడీఆర్‌ఎం), అసిత్‌ గంగూలీ (ఏఐఎస్‌కేఎస్‌), ధర్మేందర్‌ (ఏఐఏకేఎస్‌ యు), ఆదికందా (ఎన్సిడిహెచ్‌ఆర్‌), విక్రమ్‌ సింగ్‌ (ఏఐఏడబ్ల్యూయూ) తదితరులు పాల్గొన్నారు.

Spread the love