కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు

– ఎంపీ కోమటిరెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కమిషన్ల కోసమే ఆదరాబాదరాగా ప్రాజెక్టులు కట్టింది. ఆ ప్రాజెక్టులన్ని కంగిపోతున్నాయి. ఈ విషయాన్ని మేము గతంలోనే చెప్పాము. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టును నాణ్యతతో నిర్మించలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం నల్లగొండ పట్టణంలోవివిధ వార్డులలో విస్తతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ కు మిత్రపక్షం కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏమ్మార్పీ మెయిన్‌ కెనాల్‌ లైనింగ్‌ లేక కంప చెట్టు మొలుస్తున్నాయని, శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ మాత్రం లైనింగ్‌ వేసుకున్నాడని ఆరోపించారు.డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ కు లైనింగ్‌ వేస్తే దేవరకొండ, గుర్రంపొడుతో పాటు నల్గొండ అసెంబ్లీలోని టేయిలాండ్‌ వరకు కూడా నీళ్లు పారుతాయని తెలిపారు. ఎమ్మార్పీ మోటార్‌ ద్వారా నీళ్లు పెడితే పదిహేను రోజులకు గాని నీళ్లు రావటం లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పక్షపాతం వహిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కెసిఆర్‌ దోచుకున్న పైసలు అన్ని రికవరీ చేసి పథకాలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీ స్కీములను ప్రభుత్వం వచ్చిన మొదటి క్యాబినెట్‌ లోనే ఆమోదించి 100 రోజులలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌ వస్తే మంచి పథకాలు అమలవుతాయని ప్రజలంతా కాంగ్రెస్‌ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Spread the love