Sunday, April 26, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్వయసు ఓ సంఖ్య మాత్రమే

వయసు ఓ సంఖ్య మాత్రమే

- Advertisement -

వయసు మీద పడుతున్న కొద్దీ ‘అమ్మో ఇక ఏమీ చేయలేము, వయసు అయిపోతుంది, ఇక శరీరం సహకరించడం లేదు’ అనుకునే వారు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే, మనం అనుకున్నది సాధించడానికి, ఇష్టమైన రంగంలో రాణించడానికి వయసుతో సంబంధం లేదు అనుకునేవారు కూడా ఎందరో ఉన్నారు. ఈ కోవకే చెందుతారు తాడికొండ రాజేశ్వరి. అరవై ఏండ్లు నిండినా పదహారేండ్ల అమ్మాయిలా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఈ వయసులో స్కూటీపై తిరుగుతూ పిల్లలకు పాటలు, డ్యాన్స్‌ నేర్పిస్తూ వారిని ఉత్సాహపరుస్తూ తనూ నిత్య యవ్వనురాలిగా ఆనందంగా జీవిస్తున్నారు. ఇదే కళలకు ఉన్న మహత్యం అంటారు ఆమె. ఈశ్వర్‌ కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహిస్తూ కళారంగానికి ఎన్నో సేవలు అందిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

రాజేశ్వరి తాడేపల్లిగూడెంకి చెందిన నృత్య కళాకారిణి. ఎం.బి.ఎ.లో చేరి సగంలోనే మానేశారు. తండ్రి సైంటిఫిక్‌ కంపెనీలో పనిచేశారు. అమ్మ నాన్నలకి ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు. రాజేశ్వరి పెద్ద కుమార్తె. మచిలీపట్నం అనిబిసెంట్‌ శిశువిద్యామందిర్‌లో పదవ తరగతి వరకు చదివారు. తెలుగు భాష అంటే ఆమెకు చాలా ఇష్టం. చిన్నతనం నుండి ఆటల్లో, పాటల్లో, డాన్స్‌లో పాల్గొని బహుమతులు తెచ్చుకునేవారు. తల్లి వైపు వారు సంగీత కళాకారులు. విజయశ్రీ భాగవతారిణి అనే కళాకారిణి హరికథలు చెప్పడంలో దిట్ట. ఈమె రాజేశ్వరికి పెదతల్లి.

స్కూల్‌ నడిపిస్తూ…
బి.కాం. పూర్తి చేసిన రాజేశ్వరి ఆ రోజుల్లో ఉచితంగా నృత్యం నేర్పించే వేదాంతం సత్యనారాయణ గారి వద్ద డ్యాన్స్‌ నేర్చుకున్నారు. తర్వాత కాలంలో వెంపటి చినసత్యం వద్ద పదేండ్లు నేర్చుకున్నారు. తాడేపల్లి గూడెంలో ఆయన దగ్గర నృత్యంలో మెళకువలు నేర్చుకున్న ఆమె పెళ్లి కావటంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇద్దరు కూతుళ్లకు పెండ్లి చేసిన తర్వాత భర్తతో కలిసి న్యూమార్క్‌ అనే చిన్నపిల్లల పాఠశాలను నడుపుతున్నారు. మూడవ తరగతి వరకు ఆ బడి నడుపుతున్న ఆ దంపతులు దీంతో పాటు బేబీ కేర్‌ సెంటర్‌ కూడా నిర్వహిస్తున్నారు.

స్కూటీపై తిరుగుతూ…
రాజేశ్వరి పగలు బడి పిల్లలకి పాటలు, పద్యాలు, శ్లోకాలు నేర్పుతారు. సాయంత్రం 6 నుండి 8 వరకు బైక్‌ పై వెళ్లి మూడు బ్రాంచీల్లో డాన్స్‌ నేర్పిస్తారు. ఈమె తన డాన్స్‌ పిల్లలతో దేశంలోని అనేక ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు కాశీ, అయోధ్య, షిర్డీ, బాసర, శ్రీశైలంలో 30 మంది పిల్లలతో ఆమె ప్రదర్శనలు ఇప్పించారు. జనాల మెప్పు పొందారు. అంతర్జాతీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. రాజేశ్వరి ప్రస్తుతం మేడ్చల్‌ జిల్లాలో తన సేవలు అందిస్తున్నారు. కొన్ని పాటలకు తనే స్వయంగా డాన్స్‌ కంపోజ్‌ చేస్తారు. పాటలు కూడా ఆమే రాస్తారు. అలాగే కొరియోగ్రఫీ కూడా ఈమె చూసుకుంటారు. రాజేశ్వరి హ్యూమన్‌ రైట్స్‌ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఎన్నో అవార్డులు
ఈమెకు వచ్చిన అవార్డులలో ముఖ్య మైనవి రోశయ్య చేతుల మీదుగా బంగారు కంకణం, నాట్యమయూరి బిరుదు పొందారు. ఇక డాక్టర్‌ దుర్గా రాజేశ్వరి నాట్యమయూరి బిరుదుతో పాటు మూడు సార్లు కళానంది, ఒక స్వర్ణనంది పొందారు. అలాగే ఏడు ఇంటర్నేషనల్‌ అవార్డులు, మూడు నేషనల్‌ అవార్డులు పొందారు. ఈ ఏడాది ఉగాది నందీ పురస్కారాన్ని అందుకున్నారు. రాజ్యసభ ఎం.పి. ఆర్‌.కృష్ణయ్య చేతుల మీదుగా మయూరి ఆర్ట్స్‌ నంది పురస్కారం అందుకోవటం తన మధుర స్మృతి అంటారామె. 60 ఏండ్లు నిండినప్పటికీ రాజేశ్వరి ఎంతో చురుగ్గా స్కూటీపై వెళ్లి డాన్స్‌ క్లాసులు తీసుకోవటం అనేది నేటి యువతకి ఆదర్శం. తన పిల్లలతో రేడియో ప్రోగ్రామ్స్‌ కూడా చేయిస్తున్నారు. ఈ విధంగా మంచి కళాకారులను తయారుచేస్తున్న ఆమె అందరికీ ఆదర్శ అధ్యాపకురాలు.
– అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -