Thursday, June 25, 2026
E-PAPER
Homeమానవి20 ఏండ్లకే పీహెచ్‌డీ…

20 ఏండ్లకే పీహెచ్‌డీ…

- Advertisement -

చిన్న వయసులోనే ఉన్నత విద్యలో అరుదైన మైలురాయిని అధిరోహించింది మన హైదరాబాదీ యువతి కొలచన వెంకట నాగ అక్షయ శ్రీనిధి. 2005 జూలై 9న పుట్టిన ఆమె, నిట్ శ్రీనగర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ పూర్తి చేసి, వెంటనే దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలలో ఒకటైన ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్‌డీ ప్రవేశం పొంది చర్రిత సృష్టించింది. 2026 జూన్‌లో బి.టెక్ పూర్తి చేసిన అక్షయ శ్రీనిధి, అదే విద్యా ప్రవాహాన్ని కొనసాగిస్తూ పరిశోధనా రంగంలో అడుగుపెట్టింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆమె విద్యాభ్యాసం మొత్తం భారతదేశంలో సాగడమే కాకుండా, ఎటువంటి తరగతి దాటివేతలు లేకుండా సాధారణ విద్యా క్రమంలోనే ఈ స్థాయికి చేరుకుంది.

చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి
అక్షయ శ్రీనిధి చిన్నప్పటి నుంచే విజ్ఞానశాస్త్రం, గణితం, సాంకేతిక రంగాలపై ఆసక్తి కనబరిచేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. సమస్యలను విశ్లేషించడం, కొత్త విషయాలను తెలుసుకోవడం, పరిశోధనాత్మక దృక్పథం కలిగి ఉండటం ఆమె ప్రత్యేకలు. ఇంజినీరింగ్ పట్టా పూర్తి చేసిన వెంటనే పీహెచ్‌డీ ప్రవేశం పొందడం అనేది అంత సాధారణ విషయం కాదు. ఇందుకు విద్యలో ప్రతిభతో పాటు పరిశోధన పట్ల స్పష్టమైన దృష్టి, క్రమశిక్షణ, నిరంతర కృషి అవసరం. ఇవన్నీ మెండుగా ఉన్నాయి కాబట్టే ఇంత చిన్న వయసులో ఆమె ఆ స్థాయికి చేరగలిగింది. ఆమె సాధించిన ఈ విజయం పరిశోధనా రంగంలో ముందుకు రావాలనుకునే యువతులకు, విద్యార్థినులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని విద్యా వేత్తలు అంటున్నారు.

కుటుంబ సభ్యుల ఆనందం
అక్షయ సాధించిన ఈ విజయంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ‘కష్టపడి చదివితే అవకాశాలు స్వయంగా వస్తాయి. మా కుమార్తె సాధించిన ఈ విజయం మరెందరో విద్యార్థులకు ప్రేరణ కావాలని కోరుకుంటున్నాం’ అని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు.

పరిశోధనలో కొత్త అడుగు
ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్‌డీ పరిశోధన ప్రారంభించనున్న అక్షయ శ్రీనిధి, భవిష్యత్తులో దేశ అభివృద్ధికి ఉపయోగపడే సాంకేతిక ఆవిష్కరణల దిశగా కృషి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. చిన్న వయసులోనే ఉన్నత విద్యా శిఖరాలను అధిరోహిస్తున్న ఈ యువ పరిశోధకురాలు కృషి, పట్టుదల, లక్ష్యసాధనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -