– బ్యారెల్ ధరల పెరుగుదల సాకుతో కంపెనీల కృత్రిమ కొరత
– బంకుల వద్ద వాహనదారుల బారులు
– 30వ తేదీ వరకు సరఫరా ఉండదంటూ ప్రచారం
– కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
– పోలీస్ భద్రత మధ్య ఇంధన విక్రయాలు
– కలెక్టర్లతో మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
– ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారీగా పెరగనున్న చమురు ధరలు
– ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకేనని అనుమానాలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘పెట్రో’ సెగలు పుట్టిస్తోంది. చమురు కంపెనీల నుంచి సరఫరాను తగ్గించటంతో రాష్ట్రంలో అనేక చోట్ల ఇంధన సంక్షోభం తలెత్తింది. 15 రోజులుగా కంపెనీలు నిత్యం సరఫరా చేసే దానికంటే చాలా మొత్తంలో తగ్గించి సఫ్లరు చేస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు పెట్రోల్ దొరకదనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వ్యాపించడంతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచే బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. పోలీస్ బందోబస్తు మధ్య పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. కొన్ని బంకుల్లో ఆయిల్ నిల్వలు లేకపోవడంతో పూర్తిగా మూసేశారు. ముఖ్యంగా వరి కోతలు, మొక్కజొన్న, ఇతర పంటల కోతలు, రవాణాకు ఇంధన కొరత ఇబ్బందులను కలిగిస్తోంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు ఫోన్లు చేసి వాకబు చేస్తున్నారు.
వ¶తపడుతున్న బంకులు
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ బంకులు మూతపడు తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ సరఫరాను నిలిపేయటమే దీనికి కారణం. పల్లెల్లో బంకులు రెండు నెలలుగా అరకొరగా నడుస్తుం డగా, మూడ్రోజులుగా మూత పడ్డాయి. ఉభయ జిల్లాల్లో 50 శాతం బంకులు మూతపడినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
తక్కువ మోతాదులో సఫ్లరు
ఖమ్మం జిల్లాలో 150 పైగా బంకులు ఉన్నాయి. వీటికి నిరంతరం సరఫరా కావాల్సిన ఇంధనంలో కోత పెట్టారు. కంపెనీలకు అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించినా.. పంపించే స్థితి లేదు. బ్యారెల్ ధరలు పెరిగాయి అనే కారణంతో కంపెనీలు రూ.30 పెంచి తీసుకుంటున్నాయి. కమీషన్ నష్టపోయినా సరే తెప్పించుకుంటున్నా కావాల్సిన మేరకు సరఫరా చేయటం లేదని డీలర్లు వాపోతున్నారు. దీనిపై ఖమ్మం జిల్లా డీలర్లు ఆదివారం కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని కలిసి విన్నవించారు. సోమ వారం ఆయా కంపెనీల హెడ్స్‌తో సమావేశం నిర్వహించుతామని ఆయన చెప్పారు. సాధారణంగా మూడ్రోజులు రావాల్సిన ఇంధనం ఒక్క పూటకే అమ్ముడుపోతోంది. తల్లాడ నుంచి ఖమ్మం వరకు మార్గమధ్యలోని బంకుల్లో డీజిల్ దొరకట్లేదు.
వ¶డ్రోజులుగా నిలిచిన సరఫరా
అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధప్రభావం, హర్మూజ్ జలసంధిలో చమురు రవాణా నౌకలు నిలిచిపోవటంతో భారత దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఉభయ జిల్లాల్లోని బంకులకు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలు చమురు సరఫరా చేస్తుంటాయి. మూడ్రో జులుగా ట్యాంకర్లు రావటం లేదని బంకుల నిర్వా హకులు చెబుతున్నారు. ప్రధానం గా డీజిల్ సరఫరాలో చమురు సంస్థలు జాప్యం చేస్తున్నాయి. దాంతోపాటు పెట్రోల్ సరఫరాకూ ఆటంకం ఏర్పడింది. పట్టణాల్లోని కొన్ని బంకుల్లో పవర్ పెట్రోల్ అమ్ముతున్నారు. అదీ ఒకట్రెండు రోజుల్లో ఖాళీ కానుంది.
వరి కోతలపై ప్రభావం
ప్రస్తుతం వరి కోత పనులు జరుగుతు న్నాయి. గ్రామాల్లో బంకులు మూతపడటంతో రైతులు క్యాన్లతో పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. డీజిల్ దొరక్క వరి కోత యంత్రాలు నిలిచిపోతున్నాయి. కొన్ని బంకులకు డీజిల్ వచ్చిందని తెలుసుకున్న ట్రాక్టర్లు, కార్ల యజమానులు క్యాన్లు, సీసాల్లో ఇంధనం తీసుకెళ్లారు. ఒక్కొక్కరు రూ.2-4వేల ఇంధనం కోనటంతో నింపడానికి ఎక్కువ సమయం పట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో ఇంధన కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇక్కడ పది బంకులు ఉండగా వాటిలో రెండిటిలో మాత్రమే పెట్రోల్ లభిస్తోంది. ఓ బంకు వద్ద పెట్రోల్ కొట్టే గన్ను (పైపు) ఊడిపోయింది. పోలీసు భద్రత నడుమ వాహనాల్లో పెట్రోలు నింపుతున్నారు.
ప్రయివేట్ వ్యాపారుల దందా..
ప్రధాన చమురు సంస్థలైన హెచ్‌పీ, భారత్ పెట్రోలియం నుంచి లోడ్లు సకాలంలో రాకపోవడంతో కొరత తీవ్రమైంది. ఇదే అదనుగా కొందరు ప్రయివేటు వ్యాపారులు క్యాన్లలో తీసుకెళ్లి లీటరు డీజిల్‌ను రూ.125కు విక్రయిస్తున్నారు. ఖమ్మం నగరంతోపాటు కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు వంటి ప్రధాన పట్టణాల్లో మెజారిటీ బంకులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. దీంతో యాజమాన్యాలు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టేశాయి.
కృత్రిమ కొరతపై అనుమానాలు
ఎండ తీవ్రతకు తోడు గంటల కొద్దీ నిరీక్షణతో వాహనదారుల సహనం నశిస్తోంది. దీనివల్ల బంకు సిబ్బందికి, ప్రజలకు మధ్య పలుచోట్ల వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. బ్యారల్ ధరలు పెరిగిన దృష్ట్యా కంపెనీలే కావాలని సరఫరా తగ్గించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే చర్చ సాగుతోంది. ఏప్రిల్ 29వ తేదీతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగుస్తుండటంతో ఆ తర్వాత భారీగా ధరలు పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం కోసం ఇటువంటి ఎత్తుగడలు వేస్తోందనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది.
కంపెనీలే తగ్గించి సరఫరా
చమురు కంపెనీలు డీజిల్ సరఫరా తగ్గించాయి. నిల్వలు లేక బంకులు వ¶తపడుతున్నాయి. సమస్యను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాం. కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి డీజిల్, పెట్రోల్ తెప్పిస్తే ఉభయ జిల్లాల్లో కనీస అవసరాలకు ఇంధనం అందు తుంది. దీనిపై అడిషనల్ కలెక్టర్ సోమవారం కంపెనీల హెడ్స్‌తో మాట్లాడిస్తానని డీలర్లకు మాట ఇచ్చారు.
-నాగబత్తిని రవికుమార్, పెట్రోల్ బంకుల యజమానుల సంఘం రాష్ట్ర నాయకులు- ఖమ్మం



