ఆఫ్ టైప్ మొక్కలు, అవినీతిపై పోరాటం
ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే కోర్టులనూ ఆశ్రయించాం
పామాయిల్ రైతుల సమస్యలపై
మహాసభలో కార్యాచరణ
తెలంగాణ పామాయిల్ రైతు సంఘం
రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్యతో
కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఫేస్ టూ ఫేస్
రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణ గణనీయంగా పెరుగుతోంది.. సమస్యలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి.. తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) పామాయిల్ రైతుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తోంది.. అనేక విజయాలు సాధిస్తోందని తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆఫ్ టైప్ మొక్కలు మొదలు అవినీతి వరకూ ప్రతి అంశాన్నీ సునిశితమైన కోణంలో పరిశీలించి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన సందర్భాల్లో రైతుల సంక్షేమం కోసం కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు. నూతన ఫ్యాక్టరీల ఏర్పాటు, నాణ్యమైన నర్సరీల నిర్వహణ కోసం పాటుపడుతున్నామన్నారు. కొత్తగూడెంలో జరిగిన రైతు సంఘం రాష్ట్ర వ¶డో మహాసభలో పామాయిల్ రైతుల సమస్యలు- పరిష్కార మార్గాలు- నిర్వహించాల్సిన పోరాటాలపై కార్యాచరణ రూపొందించామని ‘నవతెలంగాణ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. వివరాలు పుల్లయ్య మాటల్లోనే..
పామాయిల్ ఫ్యాక్టరీలలో అవకతవకల వెలికితీత
పామాయిల్ రైతు సంఘం మూడేండ్లలో అనేక విజయాలు సాధించింది. అశ్వారావుపేట జోన్ పరిధిలో గల ఏరియాలలో తెలంగాణ రైతు సంఘం, అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో 2015 నుంచి విధిగా 2026 ఏప్రిల్ వరకు సుదీర్ఘంగా 11 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ, నర్సరీల పరిధిలో ఆయిల్‌ఫెడ్ నిర్వహణలో జరుగుతున్న అనేక అక్రమాలను వెలికి తీసింది. పోరాటాలు, ఆందోళనలు చేయటం ద్వారా కొంతమేరకు అక్రమాలను అరికట్టి రైతాంగానికి ఉపయోగం జరిగేందుకు కృషి చేసింది. అశ్వారావుపేట ఫ్యాక్టరీ విస్తరణ, రెండో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పోరాటం చేశాం. ఫలితంగా అప్పారావుపేటలో (దమ్మపేట) 60 టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు.
ఆఫ్ టైప్ మొక్కల నిర్మూలనపై..
నర్సరీల నుంచి వచ్చే ఆప్ టైప్ మొక్కల నిర్మూలనపై ఉద్యమాలు చేశాం. ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇవ్వటం ద్వారా కల్తీ మొక్కలు వచ్చాయని గుర్తించాం. ఆయిల్ ఫెడ్ ఏరియాల్లో ఇచ్చిన మొక్కలు వేలాది ఎకరాలలో గెలలు రావటం లేదు. దానిపై తీవ్రంగా పోరాడి ఆఫ్ టైప్ మొక్కలు నర్సరీ నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నాం. నష్టపోయిన రైతులకు ఆర్థికంగా సహకరించ వలసిందిగా ఆయిల్‌ఫెడ్‌పై ఒత్తిడి తీసుకొచ్చాం. గెలలు రాని చెట్లను తొలగించి ఆయిల్ ఫెడ్ ద్వారా మొక్కలు వేయించాం. నష్టపోయిన రైతులకు ఆయిల్ ఫెడ్, రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజన్ చౌహాన్, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులను కలిసి ఆయిల్ ఫెడ్ ద్వారా రైతులకు జరుగుతన్న నష్టాలను వివరించాం. గత్యంతరం లేక కోర్టునూ ఆశ్రయించాం. రైతు సంఘం కృషి ఫలితంగా ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు తోటలను పరిశీలన చేశారు. రిపోర్టు రావాల్సి ఉన్నది.
తెలంగాణ రైతుసంఘం కృషి ఫలితంగా..
దొంగ ఎఫ్-కోడ్లను రద్దు పర్చేందుకు అనేక సందర్భాల్లో ధర్నాలు చేశాం. వాటిని రద్దుపర్చగలిగాం. ఫ్యాక్టరీ, నర్సరీల పరిధిలో అక్రమాల విషయంలో పోరాటాలు నిరంతరం చేయటం ద్వారా రైతులను సంఘటితపరిచాం. గెలలతో వస్తున్న ట్రాక్టర్లను సీరియల్ నెంబర్ల ద్వారా క్రమబద్ధీకరణ చేయించాం. ఆనాడు ఒకే వేబ్రిడ్జి ఉండటం వల్ల కాటా వేయటంలో ఆలస్యం అయ్యేది. 2వ వేబ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయటం కోసం కృషి చేశాం. అశ్వారావుపేట కేంద్రంగా 2 సార్లు, ఖమ్మం కేంద్రంగా ఒకసారి పామాయిల్ రైతుల రాష్ట్ర సదస్సులు నిర్వహించాం.
అవినీతిపై యుద్ధం..
ఆయిల్‌పామ్‌లో జరిగిన రూ.33 కోట్ల అవినీతిపై కోర్టును ఆశ్రయించాం. ఆడిట్ రిపోర్టు ఆనాటి కొత్తగూడెం జిల్లా ఆడిట్ అధికారి ప్రకటించవలసి ఉంది. ఫారెస్టు పోడుభూములకు పామాయిల్ మొక్కల సబ్సిడీ కోసం పోరాటం చేశాం. సీఎస్‌ఆర్ ఫండ్స్ గిరిజన ప్రాంతంలోనే ఖర్చు పెట్టేలా ఒత్తిడి తెచ్చి విజయం సాధించాం. రిఫైనరీ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమం చేస్తున్నాం. పోరాడి విద్యుత్ లైన్లను మార్పించుకున్నాం. సంఘ విస్తరణలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి పామాయిల్ రైతులను సంఘటితం చేస్తున్నాము. వారి సమస్యలపై నిరంతరం పోరాడుతున్నాం. ఆ దిశగా మేము చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. పామాయిల్ మరింతగా విస్తరిస్తున్న దృష్ట్యా రానున్న మూడేండ్లపాటు రైతుల సమస్యలపై ఎలాంటి పోరాటాలు నిర్వహించాలో మూడో మహాసభలో కార్యాచరణ రూపొందించుకున్నాం.



