Monday, April 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ సంక్షేమ నమూనా దేశానికే మార్గదర్శి

తెలంగాణ సంక్షేమ నమూనా దేశానికే మార్గదర్శి

- Advertisement -

కేంద్రం సహకరించాలి : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సామాజిక న్యాయం, సమగ్ర సంక్షేమం, బలహీన వర్గాల సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చండీగఢ్‌లో ఆదివారం నిర్వహించిన చింతన్‌ శివిర్‌-2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సదస్సులో సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల సమర్థ అమలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ”సమానత్వం-సాధికారత-స్వాభిమాన జీవితం” లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ శాఖను ”ఎస్సీ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌”గా పునర్నామకరణం చేయడం దళితుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టికి నిదర్శనమని తెలిపారు.పోస్ట్‌ మ్యాట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కింద రూ.574.74 కోట్లు వెచ్చించి 3,39,731 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చినట్లు మంత్రి తెలిపారు. ప్రీ మ్యాట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ ద్వారా రూ.66.31 కోట్లు ఖర్చు చేసి 73,666 మంది విద్యార్థులకు సహాయం అందించినట్టు చెప్పారు. డా.బీ.ఆర్‌. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి కింద రూ.103.49 కోట్లు వెచ్చించి 564 మంది విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు కల్పించామని వివరించారు. టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్స్‌ కోసం రూ.24.53 కోట్లు ఖర్చు చేసి 2,426 మంది విద్యార్థులకు సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ అందిస్తున్నట్టు తెలిపారు.

ఎస్సీ హాస్టల్స్‌ నిర్వహణకు రూ.628.42 కోట్లు వెచ్చించి 2,26,950 మంది విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 47,539 మంది లబ్ధిదారులకు రూ.476.15 కోట్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. కులాంతర వివాహాల ప్రోత్సాహకంగా 1,723 జంటలకు రూ.43.06 కోట్లు అందించామని వివరించారు. ”రాజీవ్‌ యువ వికాసం” ద్వారా బ్యాంక్‌ లింక్డ్‌, నాన్‌ బ్యాంక్‌ పథకాల కింద సబ్సిడీలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా యువతను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు.
ఎస్సీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్సీఎస్డీఎఫ్‌) చట్టం కింద 2023 డిసెంబర్‌ నుంచి రూ.31,763.63 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.40,231.62 కోట్ల కేటాయించినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అమలుకు ప్రత్యేక కోర్టులు, మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ”తెలంగాణ ఎస్సీ రేషనలైజేషన్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ యాక్ట్‌, 2025” అమలు ద్వారా సమాన అవకాశాల కోసం చారిత్రాత్మక అడుగు వేసినట్లు మంత్రి వెల్లడించారు.

టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కింద 268 విద్యాసంస్థల్లో 1,52,701 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. 10వ తరగతిలో 97.71 శాతం ఉత్తీర్ణత సాధించి, నీట్‌, జేఈఈలో విశేష ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. ఈఆర్పీ, ఈ-ఆఫీస్‌, డీబీటీ విధానాల ద్వారా నిధులను నేరుగా లబ్ధిదారులకు చేరవేస్తూ పారదర్శకతను పెంచుతున్నామని తెలిపారు. జియో ట్యాగింగ్‌, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ ద్వారా పథకాల అమలు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
వికలాంగుల కోసం ”చేయూత” పింఛన్‌ కింద 4.74 లక్షల మందికి నెలకు రూ.4,016 చెల్లిస్తూ సంవత్సరానికి రూ.2,288 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సహాయక పరికరాల పంపిణీ కోసం రూ.50 కోట్లు ఖర్చు చేసి 7,570 మందికి అందించామని చెప్పారు.16.36 లక్షల మంది వృద్ధులకు పింఛన్ల రూపంలో సంవత్సరానికి రూ.3,958 కోట్లు వెచ్చిస్తున్నామనీ, రాష్ట్రవ్యాప్తంగా డే కేర్‌ సెంటర్లు, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల కోసం 32 ”మైత్రి క్లినిక్స్‌”, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, స్వయం ఉపాధి కోసం సబ్సిడీలు అందిస్తున్నామని వివరించారు. మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల ద్వారా 2.47 కోట్ల మందికి చేరువయ్యామనీ, 36 ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యసన చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సామాజిక న్యాయం రంగంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని మంత్రి సూచించారు.

సంక్షేమానికి సహకరించాలి : కేంద్రానికి లక్ష్మణ్‌ కుమార్‌ వినతి
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. వాటి అమలుకు కేంద్ర సహకారం అవసరమని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్ర గిరిజన మంత్రి సానుకూలంగా స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -