Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్రానికి రూ.50 వేలు జరిమానా : హైకోర్టు

కేంద్రానికి రూ.50 వేలు జరిమానా : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆధారాలు లేకుండా ఒక రిటైర్డు ఉద్యోగిపై సీబీఐ కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగంలోని అధికరణ 21 ద్వారా వ్యక్తికి లభించిన స్వేచ్ఛను కాలరాయడమేనని చెప్పింది. రిటైర్డు ఉద్యోగికి రూ.50 వేలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. 2009 జనవరి 31న రిటైర్‌ ఉద్యోగిపై, అదే ఏడాది మార్చిలో తయారైన మెడిసిన్స్‌ విషయంలో సీబీఐ కేసు పెట్టింది. సికింద్రాబాద్‌ లాలాగూడలోని రైల్వే సెంట్రల్‌ ఆస్పత్రికి సరఫరా చేసిన రాక్సీత్రోమైసిన్‌ ట్యాబెలైట్స్‌ను 2010 మేలో సీబీఐ సేకరించి పరీక్షలకు పంపింది. అవి నాణ్యత లేవని కేంద్ర ఔషధ నియంత్రణ మండలి తేల్చింది. తనపై ఉన్న ఈ కేసును కొట్టేయాలంటూ ప్రధాన నిందితుడిగా ఉన్న హిందూస్థాన్‌ యాంటీబయాటిక్స్‌ లిమిటెడ్‌ జోనల్‌ మేనేజర్‌గా చేసి రిటైర్‌ అయిన ఎకె గుప్త పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ రిటైర్‌ అయ్యాక సరఫరా అయిన మందుల విషయంలో సీబీఐ కేసు పెట్టడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. పిటిషనర్‌పై నమోదైన కేసును రద్దు చేశారు. కోర్టు ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించారు.

అప్పీల్‌ డిస్మిస్‌
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్‌ భూముల్లో నిర్మాణాల కూల్చివేతలపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆర్డర్‌లో జోక్యానికి డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. అప్పీల్‌కు విచారణార్హత లేదని చెప్పింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పద్మ ఇతరులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం కొట్టేసింది. కూల్చివేతల తర్వాత అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అన్యాయంగా ఇండ్లను కూల్చేశారని పిటిషనర్‌ లాయర్‌ వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌, కూల్చివేతలపై ప్రధాన పిటిషన్‌ ఇంకా సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేసింది. కాబట్టి అప్పీలుకు విచారణార్హత లేదన్న రిజిస్ట్రీ అభ్యంతరాలు కరెక్టేనని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -