ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డీ అబ్బాస్
హిందువులందరూ బంధువులైతే హిందూ దళితులపై దాడులెందుకు? :
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్ బాబు
ఘనంగా కేవీపీఎస్ రాష్ట్ర సామాజిక శిక్షణాతరగతులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కుల వివక్ష, అంటరానితనం, పేదరికం, నిరుద్యోగం తదితర అనేక అసమానతలతో కూడిన అంతరాలనుజన రూపుమాపడానికి యువత ముందుకు రావాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కేవీపీఎస్) రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణా తరగతులు ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్లాసుల ప్రారంభ సూచికగా కేవీపీఎస్ సీనియర్ నాయకులు కోడిసెల రాములు సంఘం పతాకాన్ని ఎగరేశారు. తరగతులకు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపాటి మనోహర్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. క్లాసులను ప్రారంభించిన అబ్బాస్ మాట్లాడుతూ దేశంలోని సగం సంపద 200 మంది చేతుల్లో ఉందని తెలిపారు. బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా అట్టడుగు వర్గాలకు అందాల్సిన సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ పాలనలో కోటీశ్వరుల సంపద మరింత పెరగగా.. అదే స్థాయిలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలపై ఉన్మాద చర్యలకు పాల్పడుతూ, ప్రతిపక్షాలపై జాతీయ దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నదని తప్పుపట్టారు. మేధావులను జైళ్లో నిర్బంధిస్తున్నారనీ, హత్యలు చేస్తున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ హిందువులందరూ బంధువులని పదే పదే చెప్పే ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకు హిందూ దళితులపై కొనసాగుతున్న దాడులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో గుడిలోకి ప్రవేశించకుండా దళితులను అడ్డుకుని గాయాలపాలు చేసినా.. ఆ ఘటనపై ఇప్పటి వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 150 కుల దురహంకార హత్యలు, సాంఘిక బహిష్కరణలు, దళితుల మీద దాడులు జరిగినా సర్కారుకు చలనం లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ను అటకెక్కించిందనీ, 27 వేల పాఠశాలలను నాలుగు వేలకు కుదించి పేదలకు, దళితులకు విద్యను దూరం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మతోన్మాదం -సాంస్కృతిక రంగంలో కర్తవ్యాలు’ అనే అంశంపై ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవి కుమార్ బోధించారు.



