మున్సిపల్ చట్టాల ఉల్లంఘన వల్లే నగరానికి ఈ దుస్థితి
ప్రజా సంఘాలు,
పర్యావరణ కార్యకర్తలతో
ప్రభుత్వం చర్చించాలి :
అర్బన్ పాలసీ నిపుణులు
డాక్టర్ దొంతి నరసింహారెడ్డి
హెచ్‌సీఎఫ్, యూడీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో చర్చా గోష్టి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో సంభవిస్తున్న వరద ముంపునకు ప్రకృతి వైపరీత్యం కంటే పాలకుల, అధికారుల ప్రణాళికా లోపమే ప్రధాన కారణమనీ, మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా ప్రణాళిక రహితంగా నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం వల్లనే, వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి వరద ముంపునకు దారితీస్తున్నాయని అర్బన్ పాలసీ నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం(హెచ్‌సీఎఫ్), అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం(యూడీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో ‘హైదరాబాద్‌లో వరద నీటి కష్టాలు-ప్రభుత్వ సన్నద్ధత’ అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్రో రైల్ పిల్లర్ల మధ్య చేపట్టిన నిర్మాణాలు వరదకు కారణం అవుతున్నాయనీ, రోడ్లు, ఫ్లైఓవర్లు కాల్వల్లాగా మారిపోవడానికి కారణం సరైన డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడమేనన్నారు.
వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద తగిన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని, వాటర్ షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేవలం అధికారులతో సమీక్షలు జరిపితే సరిపోదని, క్షేత్రస్థాయిలో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు, సంక్షేమ సంఘాలతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో ‘హీట్ ఐలాండ్’ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
చెరువుల విధ్వంసం ఆపాలి: డాక్టర్ లుబ్నా సర్వత్
ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ మాట్లాడుతూ.. బంజారాహిల్స్‌లోని వరద నీరు.. పల్లానికి ప్రవహించి ఏనుగుల కుంటలో చేరేవని, ప్రస్తుతం అక్కడ పార్కు నిర్మించడం వల్ల ఆ నీళ్ళు రోడ్లు, ఇండ్లు, అపార్టుమెంట్లలోకి వస్తున్నాయని విమర్శించారు. హైడ్రా కేవలం చెరువుల సుందరీకరణకు ఇస్తున్న ప్రాధాన్యత చెరువుల విస్తీర్ణం, లోతులకు ఇవ్వటం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా భూమిలో ఆవులను మేపుతున్నానని, కబ్జాను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రతి డబుల్ బెడ్‌రూమ్ అపార్టుమెంట్ల నిర్మాణం వద్ద తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంత నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు.
ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం: ఎం.శ్రీనివాస్
అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. జూన్ 9న కురిసిన వర్షానికి అనేక చెట్లు కూలాయని, విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, స్టీల్ బ్రిడ్జి పైన నీళ్లు నిలిచాయని, ఇది హైదరాబాద్ వాస్తవ పరిస్థితిని బట్టబయలు చేసిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదని, ఇది ప్రభుత్వ బాధ్యతారహిత్యానికి నిదర్శమని అన్నారు. నిమ్స్ వద్ద రోడ్డు పైనున్న చిన్న గుడి రాకపోకలకు తీవ్ర ఆటంకంగా ఉన్నదని, రోడ్డు పక్కన ఉన్న గుడులు, మసీదులు, చర్చిలను పక్కనే ఉన్న స్థలాలకు మార్చి ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు హైడ్రా కృషి చేయాలని సూచించారు. ఈ చర్చా గోష్టికి హెచ్‌సీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మల్లం రమేష్ వేదికపై ఆహ్వానించారు. హెచ్‌సీఎఫ్ నగర నాయకులు పి.శ్రీనివాసరావు, రాజమౌళి, డి.సైదులు, సంగీత, శ్వేత, కె.రమేష్, సుకుమార్, గోపాల్, నాగేష్, శంకరయ్య, రింగ్ సైజులు, మోహన్, ఆర్ఈ బాబు, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికా రహిత నిర్మాణాలే ముంపునకు కారణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


