Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాఠశాలల్లో న్యాయ అక్షరాస్యత

పాఠశాలల్లో న్యాయ అక్షరాస్యత

- Advertisement -

బాలల రక్షణ వ్యవస్థల బలోపేతం పాఠశాల విద్యశాఖతో న్యాయ సేవల అథారిటీ ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో న్యాయ అక్షరా స్యత, బాలల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పి.సాంకోషి సమక్షంలో పాఠశాల విద్య సంచాలకులు డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సభ్య కార్యదర్శి (జిల్లా జడ్జి) సీహెచ్‌.పంచాక్షరిలు అధికారికంగా సంతకాలు చేశారు. రాజ్యాంగ విలువలను ప్రోత్సహించడానికి, విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి, న్యాయ విద్యావ్యవస్థ ద్వారా న్యాయాన్ని అందు బాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. పాఠశాల విద్యలో న్యాయ అవగాహనను అనుసంధానం చేసి, చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు వారి హక్కులు, బాధ్యతలపై జ్ఞానం కల్పించడం దీని లక్ష్యం.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 5,711 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ప్రాథమిక హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలపై దృష్టి సారించి విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం న్యాయ అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలల వేధింపుల నివారణతో సహా బాలల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన ప్రచారాలు చేపట్టనున్నారు. పాఠశాలల్లో న్యాయ అక్షరాస్యత క్లబ్‌లు, బాలల హక్కుల క్లబ్‌ల ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలలో ఒక టీచర్‌ ను చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌గా నియమించడంతో పాటు ప్రతి జిల్లాలో న్యాయ సేవా సంస్థల సహకారంతో ఉపాధ్యాయులకు సామర్థ్య నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, వారి కుటుంబాలకు న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌, సపోర్ట్‌ సేవలు అందించడం.బడి మానేసిన పిల్లలను గుర్తించి, వారిని తిరిగి పాఠశాలకు రప్పించేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం, పిల్లల సర్వతోముఖాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందం రెండు సంవత్సరాలు అమల్లో ఉంటుంది. పరస్పర అవగాహనతో పొడిగించుకునే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -