దాని వల్లే మొక్కజొన్న, సోయాబీన్ రేట్లు పతనం
ఒప్పందంపై రాష్ట్రాలతో చర్చించకుండా కేంద్రం నిర్ణయం సరిగాదు
ఎరువుల సరఫరాపై స్పష్టత ఇవ్వాలి : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ సర్కారు అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడమంటే మన దేశ రైతుల గొంతు కోయడమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపకుండా సమాఖ్య వ్యవస్థకు మోడీ సర్కారు తూట్లు పొడుస్తున్నదని ఆరోపించారు. అమెరికాలో రైతులు భారీ సబ్సిడీలు పొందుతుండగా, భారత రైతులు చిన్న స్థాయి, అధిక ఖర్చులతో సాగు చేస్తున్న పరిస్థితిలో ఈ వాణిజ్య ఒప్పందం సమాన పోటీ కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ పోటీలో నిలబడటానికి అవసరమైన మద్దతు లేకపోవడంతో దేశీయ రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువని ఎత్తిచూపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాణిజ్య ఒప్పందం కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల రైతులు ఏ పంట వేయాలి? ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి? అనే విషయాల్లో కేంద్రం నుండి మార్గదర్శకాలు అందడం లేదని తెలిపారు. ఆ ఒప్పందం ఫలితంగా మొక్కజొన్న ధరలు 30 శాతం, సోయాబీన్, పత్తి పంటల ధరలు 20 శాతమ మేరకు పడిపోయాయని ఎత్తిచూపారు.
ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్‌ఎస్‌పీ ప్రకారం పంటలను కొనుగోలు చేయడంలో కేంద్రం విఫలమవుతున్నదని విమర్శించారు. కేంద్రం పంటలకు మద్దతు ధరల చట్టం చేయనంత వరకు ఈ పరిస్థితే ఉంటుందని స్పష్టం చేశారు. పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్, శనగలు, పెసర్లు వంటి పంటల కొనుగోళ్లలో కూడా పరిమితులు విధించడం దారుణమనీ, మిగిలిన పంటను కొనాల్సిన భారం రాష్ట్రాలపై పడుతున్నదని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు అత్యంత కీలకమైన అంశమైన ఎరువుల సరఫరా విషయంలో కూడా స్పష్టత లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం ఆహార పంటల ఉత్పత్తిపై పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
రైతుల గొంతు కోసేందుకేయూఎస్‌తో ట్రేడ్ ఒప్పందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



