Thursday, April 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి తెస్తాం

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి తెస్తాం

- Advertisement -

దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు?
– పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదు

రిపోర్టు ప్రకారం చర్యలు వద్దని చెప్పింది
– కేసీఆర్‌ మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే : సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, కొన్ని సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు వద్దని మాత్రమే కోర్టు చెప్పిందని వివరణ ఇచ్చారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ తర్వాతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి వివరాలు సీబీఐ కోరితే అన్నీ ఇచ్చేస్తామని తేల్చిచెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే కేంద్రం 48 గంటల్లో కేసీఆర్‌, హరీశ్‌రావుల్ని లోపల వేస్తామని రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు ప్రగల్భాలు పలికారనీ, ఇప్పుడా విషయంపైనే మాట్లాడట్లేదని ఎద్దేవా చేశారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మౌనం దేనికి సంకేతమో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కోర్టు పరిధిలో ఉందని తెలిపారు.

కేసీఆర్‌ శత్రువు కాదు
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై తానెప్పుడూ నెగటివ్‌గా ఆలోచించలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేననీ, శత్రువు కాదని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండటం తనకే మంచిదనీ, రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోవడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. సోమ వారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విశ్రాంతి తీసుకుంటున్న ప్రజాప్రతినిధి గురించి చెడు కోరుకోవడం తన స్వభావం కాదన్నారు. కేసీఆర్‌కు గాయమైనప్పుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాననీ, అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగానని గుర్తుచేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం ఉందన్నారు. కేసీఆర్‌కు చెడు జరగాలని ఆయన కుటుంబసభ్యులే కోరుకుంటున్నా రని ఆరోపించారు. కేసీఆర్‌ బ్రతికుంటే తమకు అధికారం రాదని ఆయన కుటుంబ సభ్యులే భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని మంత్రులతో ప్రకటనలు చేయించారని గుర్తుచేశారు. అధికార, అవినీతి పంపకాల్లో తేడాలు రావడం వల్లే ఆ కుటుంబంలో విభేదాలు వచ్చాయని విశ్లేషించారు. కవిత కొత్త పార్టీ గురించి స్పందిస్తూ వాళ్లంతా ఒక్కటేనన్నారు. అనుబంధ సంఘాలను ప్రభుత్వంపై ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తూ, తెచ్చిపెట్టుకున్న నటనను ప్రదర్శిస్తున్నారని ఆక్షేపించారు.

మనుగడలేదు
బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌కు రాజకీయ మనుగడ లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కి గతం ఉంది, భవిష్యత్‌ లేదని సీఎం చెప్పారు. ఉద్యమంలో ఎప్పుడు ఎలా మాట్లాడినా ప్రజలు సహించారనీ, అధికారంలో ఉన్న పదేండ్లూ అలాగే మాట్లాడారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబానికీ, బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవన్నారు. కేసీఆర్‌ మరమనిషో కాదో వారి కుటుంబసభ్యులకే తెలుసని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు ఓటమి కొత్తేం కాదు
కేసీఆర్‌ను ఇప్పటికే రెండు సార్లు ఓడించానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు ఓటమి కొత్తేం కాదన్నారు. అలాగే గెలుపు కాంగ్రెస్‌ పార్టీకి కొత్త కాదనీ అన్నారు. మహేశ్‌గౌడ్‌ వర్సెస్‌ కేసీఆర్‌గా జరిగిన స్థానిక సంస్థల పోరులో కూడా కేసీఆర్‌ ఓటమి చవిచూశారని గుర్తుచేశారు. తాము వివక్ష లేకుండా ప్రభుత్వం నడుపుతున్నామనీ, అన్ని వర్గాల ప్రజలకూ సమన్యాయం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ వెధవలకు విన్పించలేదేమో!
తెలంగాణ విభజనపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్‌ వెధవలు అడ్డుకోలేదన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యలను సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్లమెంటులో తెలంగాణ విభజనను పాకిస్తాన్‌ విభజనతో పోల్చిన తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఎంపీలు కౌంటర్‌ ఇచ్చారనీ, అవి బీఆర్‌ఎస్‌ వెధవలకు వినిపించలేదేమో అని ఎద్దేవా చేశారు. వెధవలకు అంతా వెధవల్లానే కనిపిస్తారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మనుగడలో ఉండదనీ, అది ఒక చచ్చిన శవం లాంటిదనీ, చనిపోయిన శవానికి వైద్యం వృధా అని చెప్పారు.

కాళేశ్వరంపై న్యాయనిపుణులతో సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనిపై న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే సీబీఐకి లేఖ రాయాలని అధికారులను అదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుని, నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. కాళేశ్వరంపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఆయన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్‌ సింఘ్వీ, మంత్రి శ్రీధర్‌బాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీబీఐ విచారణ కోసం ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా వారికి సీఎం వివరించారు. హైకోర్టు పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటును, కమిషన్‌ ఇచ్చిన నివేదికను తప్పు పట్టలేదనీ, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా న్యాయనిపుణులు వివరించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్ష’లో రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్‌, ఇరిగేషన్‌ ఈఎన్సీ శ్రీధర్‌, సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌ పాల్గొన్నారు.

పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి
సీఎం రేవంత్‌రెడ్డి

పార్లమెంటు భవనం తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సభాగౌరవం పెరిగే చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై శాసనమండలి కాన్ఫరెన్స్‌ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రైవసీ ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పబ్లిక్‌ గార్డెన్‌లో సభ్యుల కోసం క్లబ్‌ ఏర్పాటు అవసరమని చెప్పారు. అలాగే వాకింగ్‌ ట్రాక్‌, క్రీడల కోసం ఏర్పాట్లు ఉండాలని వివరించారు. వచ్చే సెషన్‌ నాటికి సెంట్రల్‌ హాల్‌ సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. హెరిటేజ్‌ భవనాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగంణ భద్రతను మరింత పటిష్టం చేయాలి చెప్పారు. ఈ సమీక్షలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీదర్‌బాబు, కౌన్సిల్‌ వైస్‌చైర్మెన్‌ బండా ప్రకాశ్‌, కార్యదర్శులు నర్సింహ్మచారి, రెండ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -