ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు కేజ్రీవాల్ నిరాకరణ
హైకోర్టు న్యాయమూర్తికి లేఖ
మహాత్ముని సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తానని వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు కేజ్రీవాల్ న్యాయమూర్తికి లేఖ రాస్తూ కోర్టుపై తనకు ‘నమ్మకం పోయిందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అంతరాత్మ ప్రభోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. న్యాయ ప్రక్రియలో సాధారణ పౌరులు ఎదుర్కొనే సమస్యలను లేవనెత్తినట్టుపర్కొన్నారు. ‘న్యాయం జరుగుతుందన్న ఆశలు ఆవిరయ్యాయి. అందుకే మహాత్మాగాంధీ చూపిన సత్యాగ్రహ మార్గంలో నడవాలని నిర్ణయించు ున్నాను. వ్యక్తిగతంగా గానీ, కనీసం నా తరపు న్యాయవాది ద్వారా గానీ విచారణకు హాజరుకాను’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే, చట్టపరంగా తనకు ఉన్న హక్కుల ప్రకారం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు.
అఖిల భారతీయ అధివక్త పరిషత్ కార్యక్రమాలకు జస్టిస్ స్వర్ణకాంత హాజరువుతున్నారని, ఆ సంస్థకు అధికార ప్రభుత్వంతో లింకులు ఉన్నాయని, అందుకే ఆ ఎక్సైజ్ కేసులో ఆ జడ్జీని తప్పించాలని కోరుతున్నట్టు గతంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. న్యాయమూర్తి ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతుంటే, నాకు న్యాయం జరుగుతుందని నేను ఎలా ఆశిస్తానని ఆయన తెలిపారు. ఈ కేసులో ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇది గాంధేయ సత్యాగ్రహం రీతిలో సాగుతుందన్నారు.
ఎన్నికల సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, స్వయంగా న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. న్యాయ వ్యవస్థపై కేజ్రీవాల్‌కు గౌరవం లేదని బీజేపీ విమర్శిస్తుంటే, తమ నాయకుడికి అన్యాయం జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు కావడంతో హైకోర్టు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బెంగాల్ ఎన్నికల వేడి, మరోవైపు కేజ్రీవాల్ చుట్టూ తిరుగుతున్న ఈ న్యాయ వివాదాలు దేశ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి.
న్యాయంపై నమ్మకం లేదు
- Advertisement -
- Advertisement -



