బంగారం కొనుగోళ్లు తగ్గించినందుకు ధన్యవాదాలు
పశ్చిమాసియా సంక్షోభాన్ని కలిగికట్టుగా ఎదుర్కొంటున్నాం
భద్రత స్వయం సమృద్ధి దిశగా భారత్
‘మన్ కీ బాత్’లో
ప్రధాని మోడీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంక్షోభంతో ఎదురైన ఉద్రిక్త పరిస్థితుల సమయంలో తాను చేసిన పలు సూచనలకు ప్రజల నుంచి మంచి స్పందన దక్కిందని ప్రధాని మోడీ అన్నారు. ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఆచరణలో పెట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రసారమైన 135వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్ సాధించిన పలు కీలక విజయాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల సమయంలో తాను చేసిన పలు సూచనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు.
తన పిలుపులకు కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా, వాటిని ఆచరణలో పెట్టడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజలను బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, ఇంధన వినియోగాన్ని నియంత్రించాలని చేసిన విజ్ఞప్తులకు దేశ ప్రజలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్‌పూలింగ్, ఇంధన పొదుపు, విదేశీ ప్రయాణాల తగ్గింపు వంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి మేలు చేస్తున్నాయన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇచ్చిన సూచనలకు ప్రజలు సహకరించడం దేశ ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే దేశం ఇలాంటి సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనగలదని ప్రధాని మోడీ అన్నారు. దేశ భద్రత స్వయం సమృద్ధి దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
2026 తొలి ఆరు నెలలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో… ఈ కాలంలో భారత్ అనేక రంగాల్లో గొప్ప విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా రక్షణ రంగంలో వచ్చిన పురోగతి దేశ ప్రజలందరికీ గర్వకారణమని ఆయన వివరించారు. స్వదేశీ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికత, బలమైన రక్షణ వ్యవస్థలతో భారత్ త్వరితగతిన ఆత్మనిర్భరత వైపు దూసుకుపోతోందని స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా 2,500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. నలంద విశ్వవిద్యాలయం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను ప్రధాని ప్రశంసించారు.
ప్రజల సహకారం దేశ ఐక్యతకు నిదర్శనం
- Advertisement -
- Advertisement -



