Wednesday, April 29, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీలో ఆప్‌ ఎంపీల విలీనం

బీజేపీలో ఆప్‌ ఎంపీల విలీనం

- Advertisement -

ఆమోదించిన రాజ్యసభ చైర్మెన్‌ సీపీ రాధాకృష్ణన్‌
మూడుకు పడిపోయిన ఆప్‌ ఎంపీల సంఖ్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ చైర్మెన్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆమోదం తెలిపినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ విలీనంతో బీజేపీ సంఖ్యాబలం భారీగా పెరిగింది. ఆప్‌ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో రాజ్యసభ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీల సంఖ్య 10 నుంచి మూడుకు పడిపోయింది. ఇక బీజేపీ సంఖ్య 106 నుంచి 113కు చేరింది. ఇక రాజ్యసభలో ఎన్డీఏ బలం 141 నుంచి 148కి పెరిగింది. ఈ నెల 24న ఆప్‌ నుంచి రాఘవ్‌ చద్దా, సాందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిట్టల్‌, హర్భజన్‌ సింగ్‌, స్వాతీ మాలివాల్‌ సహా ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించారు. వీరి విలీనానికి రాజ్యసభ చైర్మెన్‌ ఆమోదం తెలపడంతో వారంతా బీజేపీ సభ్యులయ్యారు. విలీనం తరువాత తమను ఎంపీలుగానే పరిగణించాలని కోరుతూ ఈ ఏడుగురూ రాజ్యసభ చైర్మెన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆప్‌ ఎంపీలు రాసిన లేఖ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్డ్‌కు తగినట్టు ఉందని రాజ్యసభ్య చైర్మెన్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఆ షెడ్యూల్డ్‌ ప్రకారం 2/3 మెజారిటీ ఉంటే, విలీనాన్ని ఆమోదించవచ్చు. కాగా, తమ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను సస్పెండ్‌ చేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్‌కు ఆప్‌ ఆదివారం వినతిపత్రం సమర్పించింది. కేంద్ర సంస్థలను ఉపయోగించి తమ నాయకులను ఒత్తిడి చేసి బీజేపీలోకి చేర్చుకున్నారని ఆరోపించింది. ఈ అంశంపై చట్టపరమైన పోరాటం కూడా కొనసాగుతుందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -