పరకాలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ – పరకాల
రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరగాలన్నారు. అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వేళ రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన కనీస సౌకర్యాలు (నీడ, తాగునీరు) కల్పించాలని సూచించారు.
ధాన్యం విక్రయించిన వెంటనే నిబంధనల ప్రకారం రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా పర్యవేక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ అగ్రికల్చర్ ఏఓ శ్రీనివాస్ ,మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్, వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్ పాల్గొన్నారు.వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదా రామకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు పాలకుర్తి శ్రీనివాస్, అల్లె దశరథం, గూడెల్లి సదన్ కుమార్, పోచారం ఉప సర్పంచ్ చందు, మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ, హమాలి యూనియన్ నాయకులు అశోక్, తాడ్వాయి సంఘం నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.



