మొక్కజొన్న పంట కొనుగోలు వ్యవస్థపై ఏర్పడిన సంక్షోభం, రైతుల జీవనాధారాన్ని ఎంతగా కుదిపేస్తోందో ఇటీవల పరిస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) భరోసా లేకపోవడం, ధర ప్రకటించినా సరైన కొనుగోలు యంత్రాంగం ఉండకపోవడం.. ఇవి రెండూ కలిసి రైతును మరింత అసహాయ స్థితిలోకి నెట్టేశాయి. ”పంట పండించు.. రైతును రాజుగా చేస్తాం” అన్న నినాదం కాగితం మీదే మిగిలిపోయి, నేలమీద కూడా రైతు తన పంటను అమ్ముకునే పరిస్థితి లేక తలదించుకునే దశకు పాలకులు తీసుకురావడం బాధాకరం. అన్ని పంటలకూ కనీస మద్దతు ధరగ్యారంటీ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులకనుగుణంగా ఉత్పత్తి ఖర్చులకు యాభై శాతం కలిపి (సీ2) ఎంఎస్‌పి అమలు చేయాలని కొన్నేండ్లుగా రైతులు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, మద్దతు ధర అటుంచితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మొత్తానికే పంటల సేకరణకు ఉద్వాసన పలుకుతుండటం గమనార్హం.
మార్కెట్‌లో రైతులకు పంట ధరలు పతనమైన సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు నేరుగా మార్కెట్‌లో జోక్యం చేసుకొని మద్దతు ధరపై పంటలను కొనుగోలు చేసేవి. మద్దతు ధర లేని పంటలను సైతం ప్రైస్ సపోర్ట్ స్కీం (పీఎస్‌ఎస్) కింద రైతులు నష్టపోకుండా ధర నిర్ణయించి కొనుగోలు చేసేవి. ఇక నుంచి కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో ప్రభుత్వ సంస్థలు నేరుగా రైతుల నుంచి పంటలను సేకరించేందుకు నిరాకరిస్తున్నాయి. మద్దతు ధర లేని కొన్ని పంటలకు గతేడాది ప్రయోగాత్మకంగా ప్రైస్ డిఫరెన్స్ పేమెంట్ (పీడీపీ)ను కేంద్రం అమలు చేసింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలులో లేదు. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినా రైతులకు ఉపయోగ పడటం లేదు. అక్కడున్న రాష్ట్రప్రభుత్వాలూ చేతులెత్తేశాయి. తెలంగాణాలో ధర అమాంతం పడిపోయినా, రైతులు ఆర్తనా దాలు పెక్కటిల్లుతున్నా ప్రభుత్వ సంస్థలు కొనుగోలు కేంద్రాలు కావాల్సినన్ని ఏర్పాటు చేయకుండా రైతులను గాలికొది లేశారు పాలకులు.
దీనకంతటికీ కేంద్రప్రభుత్వ విధానాలే కారణం. తాజాగా యుద్ధం సాకు చూపి పంటలు కొనుగోలు చేయడానికి నిరాకరిం చింది.
దీంతో ఎగుమతులు నిలిచిపోవటంతో మొక్కజొన్నలను కేంద్రం కొనుగోలు చేయడం లేదు. మద్దతు ధర ఉన్నా సక్రమంగా అమలు కాక వ్యాపారులు, దళారుల చేతుల్లో రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఈసారి విపరీతమైన దిగుబడులు వచ్చాయి. ఎకరానికి 30నుంచి 40 క్వింటాళ్ల పంట పడింది. కోతలు పూర్తయ్యి పంట కొనుగోలు కేంద్రాలకు తరలించిన ప్రస్తుత తరుణంలో రైతాంగం అవస్థలు ఎదుర్కొంటోంది. రైతుల ఒత్తిడితో పేరుకు కేంద్రాలు తెరిచినా ఏ ఒక్కచోటా కొనుగోళ్లు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రూ.2,400 ధర ఉన్నా ప్రయివేటు వ్యాపారుల వైపు మొగ్గుచూపుతున్నారు. క్వింటా రూ.1600కే విక్రయిస్తూ…ఒక్కో క్వింటాపై రూ.800 వరకూ నష్టపోతున్నారు.
మద్దతు ధరఉన్న పంటలక్కూడా ధరలు పతనమైన సందర్భాల్లో ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతుల నుంచి నేరుగా పంటలను సేకరిస్తే, వ్యాపారులు కొంతైనా దిగొచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు కొంతైనా రైతులకు ధర వస్తుంది. ఈ విధానం అమలులో ఉంది. అయితే, పంటల సేకరణ ఖర్చుతో కూడుకున్నదని మోడీ ప్రభుత్వం.. సేకరించిన పంటల నిల్వ, నిర్వహణ, అమ్మకం.. ఇబ్బందులని పేర్కొని క్రమంగా పంటల సేకరణ నుంచి వైదొగులుతోంది. ఈ క్రమంలో ఎఫ్‌సిఐ, నాఫెడ్ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. వ్యయప్రయాసలకు ఓర్చి మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాల్లో అమ్మినా రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని డబ్బులు ఇప్పిస్తుందా? అంటే అనుమానమే.
కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు రైతును రాజును చేస్తామని ఇచ్చిన హామీలు, ఇప్పటికీ రైతుల మదిలో నిలిచే ఉన్నాయి. కానీ ఆ హామీలు అమలులోకి రాకపోవడం వల్ల, రైతుల్లో నిరాశ పెరుగుతోంది. వ్యవసాయం లాభసాటి వృత్తిగా మారా లంటే, కేవలం నినాదాలు సరిపోవు. స్థిరమైన విధానాలు, బలమైన మార్కెట్ వ్యవస్థ, రైతుకు తక్షణ సహాయం అవసరం. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. మొక్కజొన్నకు సరైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతులకు పారదర్శకమైన మార్కెట్ వ్యవస్థ కల్పించాలి. వాటిని కార్యరూపంలో చూపినప్పుడే రైతు రాజవుతాడు తప్ప మాటలతో కాదు.
మక్క రైతుకు మద్దతేది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



