కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటి మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 సంవత్స రంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో గృహలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూతల హామీల్లో కేవలం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలు తప్ప, మిగతా ఏ హామీని నిర్దిష్టంగా అమలు చేయలేదు. నిరుద్యోగులకు భృతి, జాబ్ క్యాలెం డర్, తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజ్, బీసీలకు అన్ని రంగాల్లో 42శాతం రిజర్వేషన్‌లకు చట్టబద్ధత, తెలంగాణ ఉద్యమ కారులకు పెన్షన్, ఇళ్ల స్థలాల కేటాయింపు, ఆసరా, వృద్ధాప్య పెన్షన్‌ల పెంపు, పేదలకు వ్యవసాయ భూమి పంపకం వంటి వాగ్దానాలు మరెన్నో చేసింది. ఇందులో ఉద్యమకారులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. కేవలం తొమ్మిది మంది కవులు, కళాకారులకు, ఉద్యమకారులకు ఒక్కరికి 300 చ.గజాల ఇంటి స్థలం, నగదు ఇచ్చి, మిగతా ఉద్యమకారులకు మొండిచేయి చూపింది. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు, తెలంగాణ ఉద్యమ కారులు, ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు ప్రశ్నిస్తే ”గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందనే” నెపంతో చేతులు దులుపుకుంటున్నది. ఇది సరైంది కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలముందు పెట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకునే పై హామీలు ఇచ్చింది. పేదల సంక్షేమం -బడా పెట్టుబడి దారులకు లబ్దిచేసే విషయంలో రెండు పార్టీల ప్రభుత్వాల పాలసీ పరమైన విధానాలు ఒకే విధంగా వున్నాయి.
రాష్ట్రంలోని కోటి పదకొండు లక్షలకు పైగా వున్న అసంఘటిత- సంఘటిత కార్మికులకు కనీస వేతనాలు పెంచడం, భూమిలేని పేదలకు భూమిని పంచడం, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించడం, పట్టణ కూలీలకు ఇందిరమ్మ ఆసరా పథకం వర్తించడం, అక్రమ మైనింగ్‌ను నిరోధిóంచడం లాంటి ముఖ్యమైన పాలసీ పరమైన విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస పురోగతి లేదు. విధానాల్ని చూస్తే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక తాను ముక్కలే. నాటి ప్రభుత్వ పదేళ్ల పాలనలో కేసీఆర్ సామాజిక వర్గం, నేడు రేవంత్ రెడ్డి సామాజిక వర్గం, వారి అనుచర వర్గం అధికారం చేజిక్కించుకుని, రాజ్యాంగబద్ధ, చట్టబద్ధమైన పదవులలో కిందిస్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు వారే కీలకమయ్యారు. అందినకాడికి గత పెద్దల్లాగే వీరూ దోచుకుంటున్నారు. ఈ రెండు పార్టీల పాలసీలు బీజేపీ విధానాలకు భిన్నంగా ఏమీలేవు. నాడు కేసీఆర్ ప్రభుత్వం 2014లో తెచ్చిన జిఓ 59 ద్వారా రాష్ట్రంలోని పట్టణ, నగరాల్లోని ప్రభుత్వ విలువైన భూములు రెగ్యుల రైజేషన్, ఖానామెట్ భూములు వేలం పేరుతో తన అనుచరులకు కట్టపెట్టాడు. రేవంత్ రెడ్డి మిగిలిన ఖానామెట్ భూములు అమ్మివేసి, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మెందుకు సిద్ధపడుతున్నాడు. అవి అమ్మకుండా ఉండేందుకు మేధావులు, న్యాయవాదులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పోరాడు తున్నారు.
కేసీఆర్ అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమించుకున్న భూములమీద కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల, నగరాలకు చెందిన వేలాది ఎకరాల భూములను అక్రమంగా జిఓ నంబర్ 59 ద్వారా రెగ్యులరైజ్ అయ్యాయి. వాటిని వెనక్కి తీసుకుని ప్రభుత్వం ప్రజా అవసరాలకు వినియోగించాలని ఈ ప్రభుత్వం చూడడం లేదు. ప్రజాసంక్షేమం గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం, 2024 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు దాదాపు 20,500 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేయగా, వారు తమ సర్వీస్‌లో పొదుపుచేసుకున్న గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ బెనిఫిట్స్‌లను కూడా చెల్లించడం లేదు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ఆదేశాలు కూడా పాటించకుండ వారి బెనిఫిట్స్ చెల్లించక పోవడం వలన ఇప్పటికే 84 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు 19వేల మంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ దాదాపు 8వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సివుంది. గ్రాట్యుటీ, పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే నజరానా కాదు , అది వారి ప్రాధమిక హక్కు అని ప్రభుత్వం గ్రహించాలి. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దుబారా చేస్తూ అందాలపోటీలు, ఫుట్ బాల్ మ్యాచ్‌లు జరుపుతూ, వేలాది కోట్ల రూపాయలతో విగ్రహాలు, వందల కోట్ల రూపాయలతో దేవాలయలు నిర్మించేందుకు సిద్ధమవు తున్నది.
ఇంకొక వైపు లక్షలాది పేద విద్యార్థులు చదువుతున్న గురుకులాలు, హాస్టళ్లు, పాఠశాలలు అధ్వాన్నస్థితికి చేరుకొని కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్తలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రులు కనీస సౌకర్యాలు లేక నిరుపేద ప్రజలు సరైన వైద్యమందక బాధపడుతున్నారు. ఆర్ధిక దుబారా, అవినీతిలోనూ పీడిత ప్రజా వ్యతిరేక మైన విధానపరమైన విషయాల్లో పాలక వర్గాలఉ దొందూదొందే అనే విషయం స్పష్టమైంది. నేడు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, రాజ్యాంగ, చట్టబద్దంగా పాలన కొనసాగించేందుకు, స్వాలంబన పునాదిగా పీడిత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అవినీతి రహిత, ఆర్ధిక దుబారా చేయకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన ఇచ్చే రాజకీయ పార్టీలు లేవు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రజలు రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య ఫలాలు పొందడం లేదు. తలసరి ఆదాయం పెరుగుదల పేరుతో నాటి-నేటి ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టినా, ప్రభుత్వ లెక్కల ప్రకారమే నేటికీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90.4 లక్షల తెల్లరేషన్ కార్డులతో, 2.86 కోట్ల ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన కనీస జీవన ప్రమాణాలు లేక బతుకుతున్నారనే విషయం మరువద్దు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న దాదాపు నాలుగు లక్షల తాత్కాలిక ఉద్యోగుల్లో కనీసం రెండు లక్షల తాత్కాలిక ఉద్యోగులు 15ఏళ్లకు పైగా పనిచేస్తూ సమాన పనికి సమాన వేతనం పొందక బతుకు బండి వెళ్లదీస్తూ, కనీస జీవన ప్రమాణాలు లేక తల్లడిల్లుతు న్నారు. వీరందరూ దేశ సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసన తీర్పు, ఇతర తీర్పుల ప్రకారం రెగ్యులరైజ్‌కు అర్హులు. కానీ, రాష్ట్రప్రభుత్వం వారి రెగ్యులరైజ్ గూర్చి గత ప్రభుత్వం లాగే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కూడా చట్టాలేనని, ఆ తీర్పుల ప్రకారం రెండు లక్షల తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సిన రాష్ట్రప్రభుత్వం వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 2023లో తాను ఎన్నికలముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. లేకపోతే రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు గతంలో బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన తీర్పే ఇస్తారు.
చిక్కుడు ప్రభాకర్
8500810630
‘ఖాళీ ఖజానా’ అని ఇంకెంతకాలం చెబుతారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



