Wednesday, April 29, 2026
E-PAPER
Homeజాతీయంగుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో నిర్ణయం సరైనదే

గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో నిర్ణయం సరైనదే

- Advertisement -

424 ఎకరాలు రిజర్వ్‌ఫారెస్ట్‌గా నోటీఫై
స్వాగతించిన సర్వోన్నత న్యాయస్థానం
రాష్ట్ర ప్రభుత్వ అర్జీకి సుప్రీం అంగీకారం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో ఉన్న 424.31ఎకరాల భూమిని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా నోటీఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం స్వాగతించింది. ఈ విషయ ంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్లికేషన్‌ను అంగీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లోని 102 ఎకరాల భూమి ప్రయివేట్‌ ఆస్తి (అరాజీ – మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని గతేడాది డిసెంబర్‌ 19న సుప్రీం కోర్టు మొత్తం 47 పేజీల తీర్పును వెలువరించింది. ఈ భూమి వ్యవహారంలో సాలార్‌జంగ్‌ వారసులు చేస్తున్న వాదననూ తోసిపుచ్చింది. అలాగే గతంలో ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. సుధీర్ఘకాలంగా ఆ భూమిపై వివాదాలు కొనసాగడం, అధికారుల అలసత్వంపై బెంచ్‌ అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సమయానికి తగినట్టుగా అభ్యంతరాలను తమ వాదనలో తెలపడంలో ఫారెస్ట్‌ ఆఫీసర్లు నిర్లక్ష్యం వహించారని అభిప్రాయపడింది. ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ 102 ఎకరాల భూమిని ‘రిజర్వ్‌ ఫారెస్ట్‌’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 15 కింద పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్‌ ప్రక్రియను రెండు నెలల్లోగా(8 వారాల్లో) పూర్తి చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్‌ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని తీర్పులో స్పష్టం చేసింది. దీంతో ఈ పిటిషన్‌ మరోసారి మంగళవారం జస్టిస్‌ ఎస్‌.వీ.ఎన్‌. భట్టి, జస్టిస్‌ విజరు బిష్ణోరు లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు స్పందిస్తూ… వివాదాస్పదమైన 102 ఎకరాలతో పాటు మొత్తం ఆ బ్లాక్‌లోని 423.31 ఎకరాలను రిజర్వ్‌ఫారెస్ట్‌గా రాష్ట్రం ప్రభుత్వం గుర్తించినట్టు బెంచ్‌కు నివేదించారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ ఎస్‌.వీ.ఎన్‌. భట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్టు పేర్కొంటూ ఈ వ్యవహారంలోని అన్ని పిటిషన్లపై విచారణను ముగించారు.

అసలే ఏం జరిగింది..?
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం సాహెబ్‌నగర్‌ కలాన్‌ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102ఎకరాల భూమిపై మీర్‌ జాఫర్‌ అలీ ఖాన్‌ (సాలార్‌జంగ్‌-3 వారసులు) తదితరులు ఈ భూములు తమవేనని క్లైయిమ్‌ చేసుకుంటూ వస్తున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్‌ ఏప్రిల్‌ 20, 2023 లో సుప్రీంకోర్టులో సివిల్‌ అప్పీల్‌కు వెళ్లింది. కాగా… గత రెండున్నర ఏండ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా ఇది తమ స్వార్జిత ఆస్తి అని, జాగిర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని ప్రతివాదులు కోర్టుకు దష్టికి తీసుకెళ్లారు. అయితే 2014లో ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ ఆఫీసర్‌ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్‌ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమర్థించాయి. కాగా అన్ని వైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం… జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కారు పరమయ్యాయని డిసెంబర్‌ 19, 2025 తీర్పులోనే స్పష్టం చేసింది. రిజర్డ్వ్‌ ఫారెస్ట్‌గా గుర్తించాలని సీఎస్‌ను ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -