తెలంగాణ ప్రాంతం విశిష్టమైన సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. వేల ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ప్రకృతిని ఆరాధిస్తూ, పంటలు చేతికొచ్చినప్పుడు బోనాలు, బతుకమ్మ, సంక్రాంతి వంటి పండుగలను సామూహికంగా జరుపుకుంటారు. అయితే, ఈ భూమిపై ఎంతటి భిన్న సంస్కృతులు ఉన్నాయో, కాలక్రమేణా కుల పీడనకు వ్యతిరేకంగా అంతటి విప్లవాత్మకమైన పోరాటాలు కూడా జరిగాయి. కానీ నేడు, ఆధునిక సమాజంలో కూడా భక్తి ముసుగులో కుల ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నాలు జరగడం ఆందోళనకరం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తే, అందుకు భిన్నంగా కుల పునర్నిర్మాణానికి పునరుజ్జీవం పోస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు నిదర్శనం బొడ్రాయి. అది గ్రామాన్ని కాపాడే దేవతగా నమ్ముతారు. అలాంటిదానికి సనాతనమని, మూఢాచారాల పేరిట స్పృహ కోల్పోతున్న కులానికి జీవం పోస్తున్నారు మనువాదులు. ఊరికొక సర్పంచి, నియోజక వర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నట్లే గ్రామానికి ఒక బొడ్రాయి ఉండాలన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు.
వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో జరుగుతున్న తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనం. సుమారు 150 ఏళ్ల కిందట ఇక్కడ బొడ్రాయిని ప్రతిష్టించారు. అయితే, ఇప్పుడు గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో మళ్లీ బొడ్రాయి పండుగ చేసేందుకు రంగం సిద్ధమైంది. విడ్డూరమేమిటంటే.. మే 5,6,7 తేదీల్లో ఒకే బొడ్రాయి కాకుండా, కులాల వారీగా ఐదు బొడ్రాళ్లను ప్రతిష్టించబోతున్నారు. ఇది నేరుగా చాతుర్వర్ణ వ్యవస్థను, రాజ్యాంగ విరుద్ధమైన మనుధర్మాన్ని అమలు చేయడమే అవుతుంది. పంచములకు (దళితులకు) వేరుగా బొడ్రాయిని పెట్టడం అంటే, వారిని సమాజం నుంచి విడదీసి చూడటమే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 15 మరియు 16 ప్రకారం ప్రతి పౌరుడికి లింగ, సామాజిక సమానత్వం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. పండుగల పేరుతో ఇలా కుల పునాదులను పటిష్టం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
అందుకే, బుద్దారం గ్రామంలోని ఈ కుట్రను ఆపాలని కోరుతూ ఈ నెల 27న కలెక్టర్‌కు మేధావులు ఫిర్యాదు చేశారు.గతంలో జోగిని, బసివిని వంటి దురాచారాలను చట్టం అడ్డుకున్నట్లే, మనుషుల మధ్య వివక్షను పెంచే ఇలాంటి చర్యలపై కూడా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి. కులోన్మాదం పెరిగిపోతున్న ఈ తరుణంలో రాజకీయ పక్షాలు, అధికారులు అప్రమత్తంగా ఉండి రాజ్యాంగ విలువలను కాపాడాలి. భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన అవకాశాలను, హామీలను సంరక్షించాల్సిన గురుతర బాధ్యత రాజకీయ పక్షాలపై ఉంది. ఈదేశ వెనుకబాటుతనానికి, అసమానతలు అవకాశాలకు కేంద్ర బిందువైన కులాన్ని వదిలించుకోవాలి. పండుగల పేరుతో జరిగే ఈ దురాగతాన్ని కట్టడి చేయాలి. మన ఆలోచనలు మధ్యయుగాల వైపు కాకుండా, అంబేద్కర్, పూలే, కార్ల్ మార్క్స్ వంటి మహనీయుల ఆశయాల వైపు సాగాలి. కులాన్ని వదిలించుకొని, సోదర భావంతో కూడిన సమాజ నిర్మాణానికి బాటలు వేసుకోవాలి. పండుగలు మనుషులను కలపాలి కానీ, కులాల వారీగా విడదీయకూడదు.
పానుగంటి చంద్రయ్య
9989687057



