ఏటా 1.20 శాతం చొప్పున.. పొగాకు వినియోగం ప్రధాన కారణం
ఐసీఎంఆర్ తాజా అధ్యయనం
న్యూఢిల్లీ : ఇది భారత్‌లోని పురుషులకు ఆందోళన కలిగించే విషయం. వారిలో నోటి క్యాన్సర్ కేసులు ఏటికేడూ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా గుట్కా, పాన్, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా పరిశోధకులు గుర్తించారు.
ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాన్-కమ్యూనికబుల్ డిసీజ్ ఎపిడెమియాలజీ (ఐసీఎంఆర్-నైన్) నిర్వహించిన ఈ అధ్యయనం గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) 2022 డేటా ఆధారంగా 11 జీ20 దేశాల్లో క్యాన్సర్ ధోరణులను విశ్లేషించింది. ఈ విశ్లేషణ ప్రకారం.. భారత్‌లో పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ప్రతి ఏడాదీ సుమారు 1.20 శాతం చొప్పున పెరుగుతున్నాయి. కెనడా (0.94 శాతం), అమెరికా (0.57 శాతం) దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది.
‘అతిపెద్ద ప్రజారోగ్య సమస్యగా
మారుతున్న తీరు’
ఐసీఎంఆర్-నైన్ డైరెక్టర్ ప్రశాంత్ మాథూర్ ప్రకారం… నోటి క్యాన్సర్ భారత్‌లో ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్న వయస్సు నుంచే తంబాకు వినియోగం అలవాటు చేసుకోవడం, అలాగే మద్యపానం, పాన్, బీటెల్ నట్స్ నమలడం వంటి అలవాట్లు దీనికి కారణమవుతున్నాయి. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. దేశంలో ఎక్కువ శాతం నోటి క్యాన్సర్ కేసులు చివరి దశలోనే గుర్తించబడుతున్నాయి. దీంతో చికిత్స ఖర్చులు పెరగడం, ప్రాణాపాయం అధికమవుతోంది.
ఇక మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అత్యధికంగా కనిపిస్తున్న క్యాన్సర్‌గా కొనసాగుతోంది. దక్షిణ కొరియాలో అత్యధికంగా (5.07 శాతం) పెరుగుదల నమోదవగా.. టర్కీ, భారత్, ఇటలీ దేశాల్లో పెరుగుదల కనిపించింది. అయితే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) విషయంలో భారత్‌లో సానుకూల పరిణామం కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ సుమరు 4.19 శాతం చొప్పున కేసులు తగ్గుతున్నాయి. స్క్రీనింగ్, హెచ్‌పీవీ టీకాలు అందుబాటులోకి రావడం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.
భవిష్యత్తు అంచనాలు
ఐసీఎంఆర్ అంచనా ప్రకారం… 2024లో భారత్‌లో 15.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 8,74,404 మరణాలు నమోదయ్యాయి. ఇక ఇదే పరిస్థితి కొనసాగతే 2045 నాటికి ఈ కేసుల సంఖ్య 24.6 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. పురుషుల్లో ఒక్క నోటి క్యాన్సర్ కేసులే 2024లో 1.13 లక్షలకు పైగా నమోదైనట్టు అంచనా. 2022లో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు, 97 లక్షల మరణాలు నమోదైనట్టు ‘గ్లోబోకాన్’ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
పొగాకు వినియోగాన్ని నియంత్రించాలి
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఒక పెద్ద ఆరోగ్య సవాల్‌గా మారుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. భారత్‌లో పొగాకు వినియోగాన్ని నియంత్రించడం, ప్రారంభదశలోనే గుర్తించే చర్యలు బలోపేతం చేయడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలలో అవగాహన కల్పించాలనీ, చట్టాలను కఠినంగా అమలు చేయాలని అంటున్నారు. ప్రభుత్వాలు అటు వైపుగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పురుషుల్లో నోటి క్యాన్సర్ పెరుగుదల
- Advertisement -
- Advertisement -



