Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములవ్వండి

పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములవ్వండి

- Advertisement -


అంతర్జాతీయ సంస్థలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
‘హైనెకెన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ఇండియా’ ప్రారంభోత్సవం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్య మయ్యేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ‘గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్‌ ఆఫీస్‌’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా, స్ట్రాటెజిక్‌ ఇన్నోవేషన్స్‌, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్‌ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్‌ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూయింగ్‌ కంపెనీ హైనెకెన్‌ అంతర్జాతీయ సంస్థ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ‘హైనెకెన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ఇండియా’ పేరిట 76వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీసీసీని బుధవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యానుఫ్యాక్చరింగ్‌, కన్స్యూమర్‌ గూడ్స్‌ కంపెనీలు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు కోసం హైదరాబాద్‌నే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయన్నారు. ఆ జాబితాలో 150 ఏండ్ల చరిత్ర కలిగిన హైనెకెన్‌ సంస్థ కూడా చేరడం వల్ల తెలంగాణ బ్రాండ్‌ విశ్వవ్యాప్తమవుతుందన్నారు. హైనెకెన్‌ జీసీసీ ఫైనాన్స్‌, డిజిటల్‌, టెక్నాలజీ, అనలిటిక్స్‌ రంగాల్లో గ్లోబల్‌ సర్వీసులను అందించే స్ట్రాటజిక్‌ సెంటర్‌గా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం 300 మందికి పైగా నిపుణులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందనీ, త్వరలో ఆ సంఖ్య 1600కు చేరుకుంటుం దన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, హైనెకెన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ మెంబర్‌, సీఎఫ్‌ఓ హెరాల్డ్‌ వాన్‌ డెన్‌ బ్రోక్‌, చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ యోలాండా తలామో, చీఫ్‌ డిజిటల్‌ అండ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రోనాల్డ్‌ డెన్‌ ఎల్జెన్‌, హేనెకెన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఆకోస్‌ మగ్యారీ, యూబీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వివేక్‌ గుప్తా, చీఫ్‌ కార్పోరేట్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ గరీమాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -