– రోజువారీ మార్కెట్ వసూళ్లలో స్వల్ప మార్పులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పురపాలక సంఘ పరిధిలో రహదారుల ఇరువైపులా వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారుల నుంచి వసూలు చేసే రోజువారీ సంత మార్కెట్ రుసుములపై మున్సిపల్ వెండింగ్ కమిటీ గురువారం సమావేశమైంది. పాలకవర్గం ఆమోదంతో నిర్వహించిన ఈ సమావేశంలో గతంలో నిర్ణయించిన వసూళ్లపై స్వల్ప మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ జూపల్లి శశికళ అధ్యక్షతన టౌన్ వెండింగ్ కమిటీ (టీవీసీ) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి రోజువారీ బహిరంగ మార్కెట్ వసూళ్ల రుసుములను స్వల్పంగా సవరించాలని పాలకవర్గం తీర్మానించింది.
ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ జూపల్లి శశికళ మాట్లాడుతూ చిరు వ్యాపారులు, పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడకుండా సమతుల్య నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా, పురపాలక ఆదాయం కూడా పెరిగేలా రుసుముల సవరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి. నాగరాజు, వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్‌బాబు, కౌన్సిలర్లు, టీవీసీ సభ్యులు పాల్గొన్నారు.
2026–27 ఆర్థిక సంవత్సరానికి డైలీ మార్కెట్ వసూళ్ల రుసుములు
లారీ, పెద్ద వ్యాను – రూ.120
చిన్న వ్యాను – రూ.60
జీపు, ఆటో, ఎడ్లబండి – రూ.50
చికెన్ షాపు – రూ.100
మటన్ దుకాణం – రూ.200
చేపల దుకాణం (సొంత దుకాణంలో విక్రయం) – రూ.50
చేపల దుకాణం (సంత మార్కెట్‌లో) – రూ.200
రోడ్‌సైడ్ వ్యాపారులు – రూ.30
తోపుడు బండ్లు – రూ.30
అరటి గెలల కమిషన్ కొట్టు – రూ.500
గొడ్డు మాంసం దుకాణం – రూ.300
పంది మాంసం దుకాణం – రూ.200
బుధవారం సంత మార్కెట్ దుకాణాలు – రూ.50
మినీ వ్యాను (బొలెరో తదితర పెద్ద వాహనాలు) – రూ.80
పురపాలక సంఘం పరిధిలోని రోజువారీ సంత మార్కెట్ నిర్వహణను క్రమబద్ధీకరించడం, వ్యాపారులకు సౌకర్యాలు కల్పించడం, ఆదాయ వనరులను సమర్థంగా వినియోగించడం లక్ష్యంగా ఈ సవరణలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.



