Friday, May 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదాడులా? దిగ్బంధనం కొనసాగింపా?

దాడులా? దిగ్బంధనం కొనసాగింపా?

- Advertisement -

ఎటూ తేల్చుకోలేకపోతున్న అమెరికా తేల్చుకోలేకపోతున్న అమెరికా దాడులకు సెంట్రల్‌ కమాండ్‌ సన్నాహాలు

దాడులకు సెంట్రల్‌ కమాండ్‌ సన్నాహాలు
దిగ్బంధనమే బెటర్‌ అంటున్న ట్రంప్‌
మా కొత్త ఆయుధంతో వారికి గుండెపోటు రావచ్చు : ఇరాన్‌

ఇరాన్‌పై సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు

ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్‌..గంటన్నర పాటు టెలిఫోన్‌ సంభాషణ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే సమసిపోయేలా కన్పించడం లేదు. ఇరాన్‌పై దాడులు చేయాలా లేక ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించి ఆ దేశంపై ఒత్తిడి పెంచాలా అనే దానిపై అమెరికా ఎటూ తేల్చుకోలేకపోతోంది. అణు చర్చలకు ఇరాన్‌ ససేమిరా అంటుండడంతో టెహ్రాన్‌పై ‘స్వల్పకాలిక-శక్తివంతమైన’ దాడులు జరిపేందుకు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. మరోవైపు చర్చల వేదిక వద్దకు వచ్చేలా ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి హార్ముజ్‌ జలసంధి దిగ్బంధాన్ని పొడిగించడమే అత్యుత్తమ మార్గమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భావిస్తున్నారు. కాగా తాను ప్రతిపాదించిన తాజా శాంతి ప్రతిపాదనలను అమెరికా తోసిపుచ్చడంతో తన అమ్ములపొది నుంచి సరికొత్త ఆయుధాన్ని సంధిస్తానని ఇరాన్‌ హెచ్చరించింది. ఈ ఆయుధాన్ని ఎదుర్కోలేక శత్రుసేనలు తీవ్రంగా భయపడతాయని, వారికి గుండెపోటు రావచ్చునని వ్యాఖ్యానించింది.

నవతెలంగాణ – జనరల్‌ డెస్క్‌
ఇరాన్‌కు చెందిన కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని స్వల్పకాలిక, శక్తివంతమైన దాడులు చేయాలని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ యోచిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. ఇది పరిమితమైనదే అయినప్పటికీ శక్తివంతమైన సైనిక చర్య అవుతుందని, దౌత్య యత్నాలు నిలిచిపోతే దళాల మోహరింపు జరుగుతుందని సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. అయితే సైనిక చర్యకు దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటి వరకూ అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెంచి చర్చలకు అంగీకరించేలా చేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. తక్షణ సైనిక చర్య కంటే ఓడరేవుల దిగ్బంధమే మరింత సమర్ధవంతమైనదని ఆక్సియాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చమురు ఎగుమతులలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని ఆయన చెప్పారు. ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని, అయితే ఇరాన్‌ తన అణు కార్యక్రమాలకు స్వస్తి చెబితేనే ఏ ఒప్పందమైనా కుదురుతుందని స్పష్టం చేశారు. దిగ్బంధం కారణంగా ఎదురవుతున్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌ అనుకుంటోందని, అయితే ఎలాంటి హామీలు పొందకుండా రాయితీలు కల్పించడం తనకు సమ్మతం కాదని ట్రంప్‌ అన్నారు.

అది ‘ట్రంప్‌ జలసంధి’ అట !
హార్ముజ్‌ జలసంధి పేరును ట్రంప్‌ మార్చేశారు. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఆయన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ హార్ముజ్‌కు ‘ట్రంప్‌ జలసంధి’ అని నామకరణం చేశారు. అంతేకాక కొత్త పేరుతో ఓ మ్యాపును కూడా దానికి జత చేశారు. కాగా ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించాలన్న ట్రంప్‌ అభిమతం మేరకు దానికి అనుగుణంగా ఆయన బృందం క్షేత్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. అవసరమైతే హార్ముజ్‌ను దీర్ఘకాలం మూసి ఉంచాలని కూడా ట్రంప్‌ అనుకుంటున్నారు. అయితే హార్ముజ్‌ దిగ్బంధం కారణంగా ఇప్పటికే ఇంధన ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా స్వదేశంలో ట్రంప్‌ రేటింగ్‌ దారుణంగా పడిపోయింది. ఈ నెల ప్రారంభంలో ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధం మొదలైనప్పటి నుంచి సుమారు 40 నౌకలను అమెరికా దళాలు అడ్డుకోవడమో లేదా దారి మళ్లించడమో జరిగింది. అవసరమైతే కొన్ని నెలల పాటు దిగ్బంధాన్ని కొనసాగించేందుకు వీలుగా కార్యాచరణను రూపొందించాలని ఇంధన ఎగ్జిక్యూటివ్‌లకు ట్రంప్‌ సూచించారు.

మా కొత్త ఆయుధం చూసి వారికి గుండెపోటు రావచ్చు : ఇరాన్‌
అమెరికా-ఇజ్రాయిల్‌ దళాలపై జరుపుతున్న యుద్ధంలో కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తానని ఇరాన్‌ హెచ్చరించింది. దానిని చూసి శత్రు దళాలు భయపడతాయని, వాటికి గుండెపోటు కూడా రావచ్చునని వ్యాఖ్యానించింది. దిగ్బంధాన్ని తొలగించి, హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవాలంటూ ఇరాన్‌ చేసిన ప్రతిపాదనను ట్రంప్‌ తోసిపుచ్చిన నేపథ్యంలో టెహ్రాన్‌ నేవీ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ షారామ్‌ ఇరానీ స్పందిస్తూ శత్రు దళాలతో త్వరలోనే కొత్త ఆయుధంతో పోరాడతామని చెప్పారు. ‘అది వారిని తీవ్రంగా భయపెడుతుంది. ఆ ఆయుధం వారి పక్కనే ఉంది. దానిని చూసి వారికి గుండెపోటు రాకూడదని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఇరాన్‌ చమురు వాణిజ్యాన్ని అడ్డుకోవడం ద్వారా ఆర్థిక ఒత్తిడి తెచ్చి టెహ్రాన్‌ను చర్చలకు ఒప్పించాలన్న ట్రంప్‌ ప్రభుత్వ వ్యూహాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అది తప్పుడు ఆలోచన అని చెప్పారు. దానిని సైనిక దళాల సీనియర్‌ అధికారులు ఓ జోక్‌గా భావిస్తున్నారని తెలిపారు. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌పై తమ సేనలు ఏడు క్షిపణి దాడులు చేశాయని గుర్తు చేశారు. దీంతో అమెరికా కొంతకాలం పాటు ఆ నౌక నుంచి ఎలాంటి యుద్ధ విమానాలను ప్రయోగించలేకపోయిందని, గగనతల కార్యకలాపాలు చేపట్టలేకపోయిందని చెప్పారు. అమెరికా దిగ్బంధం అమలులో ఉన్నప్పటికీ కొన్ని నౌకలు తమ ఓడరేవుల నుంచి బయలుదేరాయని, కొన్ని గమ్యానికి చేరుకున్నాయని తెలిపారు. అమెరికా సేనలు ఆయా నౌకల సిబ్బందిని, వారి కుటుంబసభ్యులను నిర్బంధించాయని అంటూ వారు సోమాలీ సముద్ర దొంగల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఇరాన్‌ పై యుద్ధం ఖర్చు పాతిక బిలియన్‌ డాలర్లు !
ఇరాన్‌పై అమెరికా మొదలు పెట్టిన యుద్ధంపై ఇప్పటి వరకూ అయిన ఖర్చు అక్షరాలా ఇరవై ఐదు బిలియన్‌ డాలర్లు. పెంటగాన్‌ సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. సైనిక చర్యకు సంబంధించిన ఖర్చుపై ఇదే తొలి అధికారిక అంచనా. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉండగా ప్రతినిధిసభలో మెజారిటీని నిలుపుకోవడం రిపబ్లికన్లకు అసాధ్యంగా కన్పిస్తోంది. ఇరాన్‌ యుద్ధంపై పెడుతున్న ఖర్చును అమెరికా తట్టుకోగలదా అని డెమొక్రాట్లు ప్రచారం చేస్తున్నారు. యుద్ధంపై అమెరికా పెడుతున్న ఖర్చులో ఎక్కువ భాగం ఆయుధాలకే పోతోందని కాంప్ట్రోలర్‌ విధులు నిర్వహిస్తున్న జులెస్‌ హస్ట్‌ ప్రతినిధిసభకు చెందిన సాయుధ సర్వీసుల కమిటీ సభ్యులకు తెలియజేశారు. యుద్ధంపై అమెరికా ఇప్పటి వరకూ పెట్టిన పాతిక బిలియన్‌ డాలర్ల ఖర్చు ఈ సంవత్సరపు నాసా బడ్జెట్‌తో సమానం. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలి ఆరు రోజులలోనే కనీసం 11.3 బిలియన్‌ డాలర్లు ఖర్చయ్యాయని ట్రంప్‌ ప్రభుత్వం గతంలో అంచనా వేసింది.
ఇరాన్‌పై సైనిక చర్యకు దిగితే
తీవ్ర పరిణామాలు

ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్‌
గంటన్నర పాటు టెలిఫోన్‌ సంభాషణ

ఇరాన్‌పై అమెరికా లేదా ఇజ్రాయిల్‌ మరోసారి సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో టెలిఫోన్‌లో మాట్లాడిన పుతిన్‌ గంటన్నరకు పైగా సంభాషించారు. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగితే దాని ప్రభావం టెహ్రాన్‌, దాని పొరుగు దేశాలపై మాత్రమే కాకుండా యావత్‌ ప్రపంచానికీ నష్టదాయకంగా మారుతుందని ఈ సందర్భంగా ట్రంప్‌నకు పుతిన్‌ చెప్పారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్‌ స్వాగతించారు. పుతిన్‌-ట్రంప్‌ మధ్య జరిగిన టెలిఫోన్‌ సంభాషణ వివరాలను క్రెమ్లిన్‌ ప్రతినిధి యూరి ఉపాకోవ్‌ పాత్రికేయులకు వివరించారు. ఫోన్‌ సంభాషణలో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం, ఉక్రెయిన్‌ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులను, రష్యా సాధిస్తున్న పురోగతిని పుతిన్‌ వివరించారు. జెలెన్‌స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఐరోపా దేశాల మద్దతుతో ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని సాగదీస్తోందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. రష్యా చొరవతో జరిగిన ఈ చర్చలు ఫలప్రదంగా సాగాయని క్రెమ్లిన్‌ ప్రతినిధి తెలిపారు.

ఆ స్థావరంపై ఇరాన్‌ ఒక్కరోజే 28 దాడులు : బీబీసీ
బాగ్దాద్‌ : ఇరాక్‌లోని ఓ సైనిక స్థావరాన్ని అమెరికా, ఇజ్రాయిల్‌ దళాలు ఇరాన్‌పై దాడుల కోసం ఉపయోగించుకున్నాయి. ఇరాన్‌ లక్ష్యంగా చేసుకున్న ఆ స్థావరాన్ని సందర్శించేందుకు బీబీసీ ప్రతినిధులను అనుమతించారు. కాల్పుల విరమణ అమలులోకి రాక ముందు ఆ స్థావరంపై ఇరాన్‌ ఒక రోజు 28 డ్రోన్‌ దాడులు చేసింది. ఇలా అనేక రోజుల పాటు దాడులు కొనసాగాయి. కాగా ఇరాన్‌పై యుద్ధానికి చాలా కాలం ముందే ఈ స్థావరాన్ని అమెరికా, ఇజ్రాయిల్‌ ఉపయోగించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -