Wednesday, July 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమత్తులో యువత

మత్తులో యువత

- Advertisement -

పెరుగుతున్న గ్యాంగ్ వార్ సంస్కృతి
చిన్న గొడవలు.. ఘర్షణలకు 
దారి తీస్తున్న వైనం
తల్లిదండ్రులకు కన్నీళ్లు


నవతెలంగాణ-బోడుప్పల్

“క్షణంలో కోపం.. ఒక తప్పుడు నిర్ణయం.. జీవితాంతం శిక్ష” ప్రస్తుత సమాజంలో యువతలో పెరుగుతున్న మత్తు అలవాట్లతో తీసుకునే నిర్ణయాలు అనేక కుటుంబాలను చీకటిలోకి నెడుతున్నాయి. డ్రగ్స్‌.. మత్తు పదార్థాలు పోలీసుల కండ్లుగప్పి చాపకింద నీరులా విద్యాసంస్థల్లోకి భారీగా చేరుతున్నాయి. ఈ పరిస్థితి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో తీవ్రం కాగా..మిగతా పట్టణ ప్రాంతాల్లోనూ పాకింది. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్, మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో మరింత భయానకంగా మారింది. పుస్తకాలతో కుస్తీ పడుతూ ముందుకు సాగాల్సిన వయస్సులో మద్యం, గంజాయి మత్తులో భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. దారి తప్పుతున్న యువతను సన్మార్గంలో పెట్టాల్సిన రాజకీయ పార్టీలు, సంస్థలు వారిని వాడుకుని మరింత నరకకూపంలోకి తీసుకెళుతున్నాయి.

చిన్న గొడవ.. పెద్ద ఘర్షణ
బోడుప్పల్ సర్కిల్‌లోని ఒక వైన్ షాపు వద్ద ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన చిన్న గొడవ ప్రాణాల మీదకు తెచ్చింది. దేవేందర్ నగర్‌లో గృహప్రవేశ వేడుకలో జరిగిన ఘర్షణలో భారీ ఆస్తి నష్టం వాటిల్లడం వంటి ఘటనలు యువత మత్తుకు ఎంతగా బానిసలను చేసిందో చూపిస్తున్నాయి.

​ మత్తు పదార్థాలే మూల కారణం
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. బస్తీల్లో పెరుగుతున్న బెల్ట్ షాపులు, గంజాయి సరఫరా నేరాలకు మూలంగా మారుతున్నాయి. మత్తులో ఉన్నప్పుడు చిన్న మాటలే పెద్ద గొడవలకు దారి తీస్తూ చివరికి హింసాత్మక సంఘటనలుగా మారుతున్నాయి.

​రాజకీయ స్వార్థానికి బలవుతున్న యువత
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిస్థితికి సామాజిక కారణాలతో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా కారణం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం యువతను గుంపులుగా విభజించడం, ప్రోత్సహించడం పరిస్థితిని మరింత విషమం చేస్తోంది. ఫలితంగా బంగారు భవిష్యత్‌ బుగ్గిపాలు అవుతోంది. ఇప్పటి రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలూ సమాజం పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయి. తప్పు చేసి జైళ్లకు వెళ్లిన వారు నాయకులుగా చలామణి కావడం, రాజకీయ నేతలూ మత్తు కొలిపే పదార్థాలు వాడటం, వారి కుటుంబ సభ్యులు తప్పు చేసినా చర్యలు లేకపోవడం, ఒకరిపైఒకరు చేసుకుంటున్న జుగుస్పాకరమైన మాటల వల్ల సమాజంలో చెడు ప్రభావాన్ని పెంచుతున్నాయని మేధావులు అభిప్రాయపడ్డారు. కులం, మతం, ప్రాంతం పేరిట గ్రూపులుగా చీలిపోవడం, వాటికి యువతను ఆకర్షించేలా రాజకీయ పార్టీలు ప్రేరేపించడం దాడులకు కారణమవుతోంది.

​తల్లిదండ్రుల‌కు కన్నీళ్లు
ఈ ఘటనలలో తీవ్రంగా నష్టపోయేది తల్లిదండ్రులే. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఎన్నో కలలు కన్న తల్లదండ్రులకు దు:ఖాన్ని మిగుల్చుతున్నారు. పిల్లలు జైలు పాలవడం లేదా ప్రాణం కోల్పోవడం చూసి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. వారి కలలు కండ్ల ముందే ఛిద్రమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం.. కుటుంబం, సమాజం, విద్యాసంస్థలు కలిసి యువతలో అవగాహన పెంచాలని మేధావులు సూచించారు.

​పోలీసుల చర్యలు కీలకం
యువతను నేరాల దారిలోనుంచి దూరం చేయడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం. “పోలీసు మీ కోసం”, “కమ్యూనిటీ కాంటాక్ట్” కార్యక్రమాల ద్వారా కాలనీలు, బస్తీల్లో యువతతో నేరుగా మాట్లాడే వేదికలు ఏర్పాటు చేయాలి.గ్యాంగ్‌లపై ప్రత్యేక నిఘా, ఇంటింటి సమీక్షలు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టి సమస్యలను ముందుగానే అరికట్టాలి. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎదురయ్యే పరిణామాలపై యువతకు స్పష్టమైన అవగాహన కల్పించాలి.

​బెల్ట్ షాపులపై కఠిన చర్యలు
బస్తీల్లో పెరుగుతున్న బెల్ట్ షాపులను అరికట్టడం, గంజాయి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టడం అత్యవసరం. రాత్రివేళల్లో గస్తీ పెంచి యువత రోడ్లపై తిరగకుండా నియంత్రిస్తే ఘర్షణలను తగ్గించే అవకాశం ఉంది.క్షణికావేశం కాదు.. క్షణం ఆలోచన అవసరం.మత్తు కాదు.. భవిష్యత్తే ముఖ్యమని గుర్తించే సమయం ఇదే.

​అల్లరి మూకలపై కఠిన చర్యలు తప్పవు : 
మేడిపల్లి సీఐ డి. జలంధర్ రెడ్డి
మేడిపల్లి పరిధిలో అల్లరి మూకలపై కఠిన చర్యలు తప్పవని మేడిపల్లి సీఐ 
డి.జలంధర్రెడ్డి హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పటి‌ష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అవసరమైతే నాకాబందీ ఏర్పాటు చేస్తామని, గస్తీ మరింత పెంచుతామన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఎవరిపైనైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -