Wednesday, July 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలపై ప్రతిష్టంభన

చర్చలపై ప్రతిష్టంభన

- Advertisement -

జరుగుతాయన్న ట్రంప్…అలాంటిదేమీ లేదన్న ఇరాన్
ఖతార్ రాజధాని దోహాలో భేటీపై అందరి దృష్టి

వాషింగ్టన్/టెహ్రాన్ : ఇరాన్, అమెరికా మధ్య దోహాలో మంగళవారం జరగాల్సిన చర్చలపై అనిశ్చితి నెలకొంది. ఇరాన్ అభ్యర్థన మేరకు చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే అలాంటిదేమీ లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ సోమవారం వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఖతార్ రాజదాని దోహాలోజరిగే చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ చర్చలు జరుగుతాయని తెలిపారు. ‘వారి వద్ద అణ్వాయుధం ఉండకూడదని మేము కోరుకుంటున్నాము. అందుకు వారు అంగీకరించారు కూడా’ అని అన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. రాబోయే రోజులలో అమెరికాతో చర్చలు జరపాలన్న ఆలోచన ఏదీ లేదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌బాఘై చెప్పారు. రెండు దేశాల మధ్య ఏ స్థాయిలోనూ చర్చలు ఉండవని అన్నారు. పరస్పర విరుద్ధంగా ఉన్న అమెరికా, ఇరాన్ ప్రకటనలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వంద రోజులకు పైగా జరిగిన ఘర్షణలకు ముగింపు పలుకుతూ ఇరు పక్షాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

పలు అంశాలపై రెండు దేశాల ప్రతినిధుల మధ్య స్విట్జర్లాండ్‌లో ఎంఓయూ కూడా కుదిరింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి రెండు రోజుల పాటటు దాడులు, ప్రతి దాడులు జరిగాయి. వీటికి స్వస్తి చెప్పి తిరిగి సంప్రదింపులు ప్రారంభించేందుకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి కూడా. అయితే అవి ఎప్పుడు జరుగు తాయన్నది తెలియడం లేదు. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌ల నేతృత్వంతోని బృందం దోహా బయలుదేరింది. ఇరాన్ కూడా ఈ వారంలో ఓ సాంకేతిక బృందాన్ని ఖతార్ పంపుతోంది. అయితే ఇరాన్ ప్రతినిధి బృందం పర్యటనకు, చర్చలకు సంబంధం లేదని బాఘై తెలిపారు. ఇరాన్ బృందం పర్యటనను ద్వైపాక్షిక చర్చలకు సంకేతంగా చూడవద్దని చెప్పారు. అమెరికా, ఇరాన్ సాంకేతిక బృందాలు బుధవారం ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తులతో వేర్వేరుగా సమావేశమ వుతాయని తెలుస్తోంది. ఏదేమైనా దోహా చర్చలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఎంఓ ఉనికిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మధ్యప్రాచ్యంలో… ముఖ్యంగా లెబనాన్‌లో ఉద్రిక్తతల నివారణ కోసం జరుగుతున్న ప్రయత్నా లను కూడా ఈ పరిణామం సంక్లిష్టం చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -