పొరుగు రాష్ట్రాలు నీళ్లను దోచుకుంటున్నా పట్టింపేదీ..
రైతు ఆశీర్వాద సభ కాదు..
వంచన సభ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ జడ్చర్ల /మిడ్జిల్
ప్రతి ఓటూ అత్యంత కీలకమని, సర్‌లో ఓట్లు మిస్ కాకుండా.. ఓటర్ల హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మంగళవారం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై బీఆర్‌ఎస్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మిడ్జిల్ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ రాధిక భర్త, బీఆర్‌ఎస్ నాయకులు మన్యం వెంకట్‌రెడ్డి విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రతి ఓటూ అత్యంత విలువైనదని, అర్హులైన ఓటర్ల పేర్లు సర్ ప్రక్రియలో భాగంగా జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన సహాయం అందించాలని చెప్పారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని, ప్రతి ఓటరుకూ ఓటు హక్కు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతులను అడుగడుగున్నా వంచించారని, హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పెట్టిన సభ ”రైతు ఆశీర్వాద సభ కాదు.. వంచన సభ” అని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని హామీనిచ్చి.. ఇచ్చింది రూ.12వేలని, అవి కూడా పూర్తిగా ఇవ్వలేదని అన్నారు. ఒక పంటకు 3 ఎకరాలకు, ఇంకో పంటకు రెండెకరాలకు ఇచ్చారని తెలిపారు. బాకీ పడిన రైతుబంధు నిధులను ఎన్ని రోజుల్లోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఏపీ, కర్నాటక రాష్ట్రాలు గోదావరి, కృష్ణ, తుంగభద్ర నీళ్లను దోచుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మిడ్జిల్ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మాజీ జడ్పీటీసీ హైమావతి బాల్ రెడ్డి, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు రజిని, పాండు, బర్గెల సుదర్శన్, శశిరేఖ, బాలు పాల్గొన్నారు.
ప్రతి ఓటూ అత్యంత కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



