నవతెలంగాణ-సిర్పూర్(టి): బాలికలు విద్యా రంగంలో మరింతగా రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యాభ్యాసానికి దూరం కాకుండా కృషి చేయాలని సూచించారు. విద్య మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే కాకుండా సమాజంలో గుర్తింపు తీసుకువస్తుందని తెలిపారు.శుక్రవారం తన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల నేపథ్యంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థిని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీక్యాల పహాడ్ గ్రామానికి చెందిన గుర్నులే నాగేష్ కుమార్తె సువర్ణ 600 మార్కులకు గాను 537 మార్కులు సాధించి కాగజ్‌నగర్ డివిజన్ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను ఘనంగా సన్మానించారు.
అలాగే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయుడు కన్నయ్యతో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీటిడబ్ల్యూఓ రమాదేవి, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు మరియు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.



