Saturday, May 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

- Advertisement -

మేడే సందర్భంగా కార్మికులతో డిప్యూటీ సీఎం భట్టి సహపంక్తి భోజనం
నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్‌

కార్మికుల హక్కులు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడే వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారని, 140 సంవత్సరాలకు పూర్వం చికాగో నగరంలో కార్మికులు 8 గంటలు పని విధానం అమలు చేయాలని కోరుతూ ఉద్యమించారని, ఆ సందర్భంలో కార్మికులపై చేసిన దాడిలో రక్తం చిందిన సందర్భానికి గుర్తుగా మే 1న కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారని తెలిపారు. భారత దేశంలో డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ నాయకత్వంలో కార్మికులు అణగారిన వర్గాల వారి హక్కుల రక్షణ, అభివృద్ధికి కృషి చేశారని, కార్మికుల సంక్షేమంపై వారి హక్కుల గురించి బ్రిటిష్‌ పరిపాలనలో వైస్రారు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిలర్‌ దృష్టికి తీసుకువెళ్లారని, భారత దేశంలో సైతం కార్మికులు 8 గంటల పని చేసేలా కౌన్సిల్‌ వద్ద పోరాటం చేశారని తెలిపారు. అనంతరం స్వాతంత్రం సాధించుకున్న భారత దేశంలో రాజ్యాంగంలో కార్మికుల హక్కులు, చట్టాల రూపంలో కల్పించిన ఘనత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌దేనని అన్నారు. పురుష కార్మికులతో పాటు, మహిళలకు మొట్టమొదటిసారిగా మెటర్నటీ లీవ్‌ను ఏర్పాటు రాజ్యాంగం ద్వారా పొందుపరిచారని, అలాగే ఇంట్లో పని చేసే వారికి కూడా మెటర్నరీ లీవ్‌ ఇచ్చే విధంగా హక్కులు కల్పించారని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. సమావేశంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్‌ఆర్‌ , ఎమ్మెల్సీ కె.శంకర్‌ నాయక్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అంతకుముందు ఉపముఖ్యమంత్రి వద్ద సీపీఆర్‌ఓగా పనిచేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన మధుసూదన్‌ ఇటీవల గుండె పోటుతో అకాల మరణం చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మిర్యాలగూడ పట్టణానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

మధుసూదన్‌ కుటుంబానికి పరామర్శ
ఇటీవల గుండెపోటుతో మతిచెందిన తన పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఎం.మధుసూదన్‌ మృతి బాధాకరమని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మధుసూదన్‌ కుటుంబసభ్యులను పరామర్శించి మాట్లాడారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మధుసూదన్‌ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -