ఎస్‌ఎల్‌బీసీలో కూలీలు చనిపోతే శవాలను తీయలేని దుస్థితి
సిగాచి పరిశ్రమ కార్మిక కుటుంబాలను పట్టించుకోలేదు
ఆటో అన్నలకు మొండిచేయి చూపిన ప్రభుత్వం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ భవన్‌లో ఘనంగా మేడే వేడుకలు
కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మాజీమంత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీలో కూలీలు చనిపోతే వారి శవాలను బయటికి తీయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సిగాచి పరిశ్రమలో కార్మికులు సజీవ దహనమైనా ఆ కుటుంబాలను పట్టించుకోలేదని చెప్పారు. బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్మికులకు మేడే శుభాకాంక్షలు చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలోని వలస కూలీల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలబడిందని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాల కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకుందని అన్నారు. సిగాచి పరిశ్రమలో 54 మంది సజీవ దహనమైతే ఆ కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇస్తామన్న నష్టపరిహారాన్ని కూడా ఇవ్వలేదని చెప్పారు. నగరానికి బతకడానికి వచ్చిన కూలీలు, కార్మికుల ఇండ్ల మీదికి బుల్డోజర్లను పంపిస్తున్నారని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి దాదాపు రెండున్నరేండ్లు అయినా ఒక్కదాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కేవలం అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.80 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక్కరంటే ఒక్కరికి కూడా మంచి చేయలేదన్నారు. ఆటో అన్నలను ఆదుకుంటామని ఎన్నికలప్పుడు హామీలిచ్చిన ప్రభుత్వం వారికి మొండి చేయి చూపించిందని అన్నారు. స్వయంగా రాహుల్ గాంధీని ఆటోలో దింపి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్న ఆటో డ్రైవర్ పరిస్థితి అధ్వాన్నంగా మారిందనీ, ఉన్న రెండు ఆటోలు అమ్ముకుని కార్మికుడిగా మారిపోయాడని వివరించారు. కేసీఆర్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ బోర్డు ద్వారా 27 లక్షల మంది కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు అంగన్వాడీల జీతాలు పెంచమంటే వారిని అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. కోసుకు తిన్నా జీతాలు పెంచేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని గుర్తు చేశారు. సమావేశం అనంతరం కార్మికులతో కలిసి కేటీఆర్ సహపంక్తి భోజనం చేశారు. బీఆర్‌టీయూ అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు వి శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్‌టీయూ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



