న్యాయపరమైన చిక్కుల్లేకుండా చూస్తాం:మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-హైదరాబాద్
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ, చిత్తశుద్దితో ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్బాలలో ఇచ్చిన హామీల మేరకు అందరి అభిప్రాయాలను సేకరించి వచ్చేనెల జూన్ రెండో తేదీనాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామని చెప్పారు. శుక్రవారం సచివాల యంలోని జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్, జర్నలిస్ట్స్ హౌసింగ్, డెక్కన్ జర్నలిస్ట్స్ , తెలంగాణ హౌసింగ్ సొసైటీలతో మంత్రి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు ఎప్పుడు ఏర్పాట య్యాయి, అందులో సభ్యుల సంఖ్య, సభ్యత్వానికి అర్హతలు, ఇతర అన్ని అంశాలపై మంత్రి సొసైటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మినహా మిగిలిన మూడు సొసైటీల్లో సుమారు 2,424 మంది అర్హులైన జర్నలిస్టులు ఉన్నట్టు ప్రాధమికంగా గుర్తించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఒకేతాటిపై ఉంటే సమస్యల పరిష్కారం సులువు అవుతుం దన్నారు. అన్ని సొసైటీలు కలిపి ఒకే వేదికపైకి వచ్చి జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టు సంఘాలలో సభ్యులు కాని అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్ధలాలు ఇస్తామని చెబుతూ ఎలాంటి విమర్శలకు, అనుమానాలకు తావు లేకుండా ఇళ్ల స్ధలాల మంజూరు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనన్నారు.
రవీంద్ర భారతిలో జర్నలిస్టుల కుటుంబాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భూమి అప్పగించినప్పటికీ న్యాయవివాదాల కారణంగా సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని గుర్తు చేశారు. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్ధలాల సమస్యను పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని జూన్ రెండవ తేదీ నాటికి కొలిక్కి తీసుకువస్తామని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూల దక్పధంతో ఉన్నారనీ, ఫ్యూచర్ సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరో క్రాట్స్‌తో పాటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్ధలాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వారికి సూచన ప్రాయంగా వెల్లడించి సొసైటీలో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. 18 సంవత్సరాల క్రితమే ఇంటి స్ధలాల కోసం ప్రతిసభ్యుడు రెండు లక్షల రూపాయిల చొప్పున చెల్లించారని దీనిని దష్టిలో పెట్టుకొని ఇళ్ల స్దలాల కేటాయింపులో తమ సొసైటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా సభ్యులు మంత్రిని కోరారు. సమావేశంలో మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ జి. ముకుంద రెడ్డి, సీపీఆర్‌వో మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 2 నాటికి జర్నలిస్టుల ఇండ్ల స్ధలాల సమస్య కొలిక్కి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



