తాగునీటి సమస్య రాకుండా చూడాలి
చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలి : మంత్రి పొంగులేటి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ, ఆ మేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది-2026లో ఎండలు , వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందనీ, జూన్ 15 వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలుంటాయనీ, ఐఎండి హెచ్చరికల నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై 20 సంబంధిత శాఖలతో మంత్రి పొంగులేటి శుక్రవారం సచివాలయంలో తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, ఇండియన్ మెట్రలాజికల్ శాఖ కలిసి రూపొందించిన సమగ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్-2026ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 రోజుల్లో రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా తాగునీటి కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మోటార్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూసుకోవాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామనీ, రోజుకు 14 గంటలు ఫిల్లింగ్ చేసి 15 వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. అన్నిశాఖలు ముఖ్యంగా పంచాయితీ రాజ్, మున్సిపల్, ఫైర్, హెల్త్ సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.
ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి వీలుగా 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికలను పంపించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వడగాలుల ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా చనిపోతే మానవతా దృక్ఫధంతో వ్యవహరించి తక్షణం ఎక్స్‌గ్రేషియో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నల్లగొండ, మంచిర్యాల, సూర్యాపేట, పెద్దపిల్లి, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందనీ ఈ జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ఆడుకుంటూ ప్రమాదాలకు గురౌతున్నారనీ, ఆయా ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, రెవెన్యూ విభాగాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
ఎండలకు సంబంధించిన సమాచారం, అధిక ఉష్ణోగ్రతల వేళ ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, కూల్ వార్డుల ఏర్పాటు, ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహణ వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. వేడి ప్రదేశాల్లో పనిచేసే కార్మికులను రెండు బృందాలుగా విభజించి కనీసం గంట లేదా రెండు గంటల విశ్రాంతి ఇచ్చేలా రొటేషన్ పద్దతి అవలంభించేలా పరిశ్రమలకు సూచించాలన్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్ధనా స్ధలాల వంటి పబ్లిక్ ప్రాంతాల్లో అవసరమైన షెల్టర్లు, తాగునీరు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్‌ఇడీ స్క్రీన్ల ద్వారా ప్రచారం కల్పించాలని స్ధానిక సంస్దలు, మున్సిపాల్టీలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వడగాలుల పై హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్
- Advertisement -
- Advertisement -



