Sunday, May 3, 2026
E-PAPER
Homeసోపతిడబ్బు దారి చూపే జీవన గడియారం

డబ్బు దారి చూపే జీవన గడియారం

- Advertisement -

మనిషి జీవితంలో డబ్బు లక్ష్యం కాదు, అవసరం మాత్రమే. అయినా ఆ అవసరాన్ని మనం ఎలా నడిపిస్తామన్నదే జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. చిన్న ఆదాయంతోనే కొందరు ప్రశాంతంగా జీవించగలుగుతారు, భారీ జీతం ఉన్నా కొందరు శాశ్వత అసంతప్తితో ఉన్నారు. ఈ తేడాకు అసలు కారణం పొదుపు అలవాటు. నెలాఖరు వచ్చేసరికి జేబు ఖాళీ అయ్యే వారి జీవితంలో భయమే ఎక్కువగా ఉంటుంది. కానీ సంపాదించిన దానిలో కాస్తైనా దాచుకునే అలవాటు ఉన్నవాడు అనుకోని పరిస్థితుల్లో కూడా తడబడడు. పిల్లల చదువు, ఇంటి అవసరాలు, ఆరోగ్య సమస్యలు… ఇవన్నీ ముందే డబ్బు దాచుకున్నవారికి భారం కావు, బాధ్యతగా మాత్రమే కనిపిస్తాయి.

పొదుపు అలవాటుతో పాటు కుటుంబ బడ్జెట్‌ కూడా అదే స్థాయిలో అవసరం. డబ్బు చేతికి రాగానే ఎక్కడెక్కడ ఖర్చు అవుతుందో తేల్చకుండా వదిలేస్తే, ఎంత సంపాదించినా సరిపోదు. ప్రతి నెల ఆదాయం, ఖర్చు, అవసరం, అనవసరం… ఈ నాలుగు స్పష్టంగా తెలిసినప్పుడే ఇంటి ఆర్థిక వ్యవస్థ సరిగ్గా నడుస్తుంది. ఒక జాబితాగా రాసుకుని, ముందుగా అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి, మిగిలిన దానితో కోరికలు తీర్చుకుంటే అప్పుల ఊబిలో పడే ప్రమాదం చాలావరకు తగ్గిపోతుంది. కుటుంబంలోని ప్రతి సభ్యుడికీ ఈ బడ్జెట్‌ అవగాహన ఉంటే, ఖర్చు క్రమశిక్షణగా మారుతుంది.
అప్పు అనేది తప్పు కాదు, కానీ నియంత్రణ లేని అప్పు మహా భయం. అవసరమైన సందర్భంలో తీసుకున్న అప్పు మనిషిని గట్టెక్కిస్తే, సరదా కోసం చేసిన అప్పు జీవితానికి శిక్షలా మారుతుంది. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు తీసుకునే పరిస్థితి వస్తే, ఆ వ్యక్తి జీవితం అప్పులకు బానిస అయిపోతుంది. అప్పు తీసుకునేముందే అది ఎలా తీర్చాలి, ఎంత కాలంలో తీరాలి అన్న దానిపై స్పష్టత ఉండాలి. వడ్డీ కన్నా మన నిద్ర ఎక్కువ విలువైనదని తెలిసిన రోజే అప్పుల నిర్వహణ నిజంగా మన చేతిలోకి వస్తుంది.
అనుకోని సమస్యలు ముందుగా చెప్పి రావు. ఒకరోజు ఆరోగ్యం చేతికందకపోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, వ్యాపారం కుదేలవవోచ్చు. అలాంటి క్షణాల్లో చేతిలో ఒక చిన్న అత్యవసర నిధి ఉంటే మనిషిలో ధైర్యం నిలుస్తుంది. కనీసం మూడు నుంచి ఆరు నెలల కుటుంబ ఖర్చులకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోవడం మన కాలంలో అత్యంత అవసరమైన రక్షణ కవచం. ఇది పెట్టుబడికాదు, ఆడంబరంకాదు, జీవన భద్రతకు వేసుకునే కంచె మాత్రమే.
యౌవనంలో ఉన్నప్పుడు చాలామంది రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచనే చేయరు. ఇప్పుడేముంది,… తర్వాత చూద్దామని వదిలేస్తారు. కానీ కాలం ఎప్పుడు ఎలా మారుతుందో మన చేతిలో ఉండదు. పని చేసే శక్తి ఉన్నప్పుడే, సంపాదన వస్తున్నప్పుడే రాబోయే రోజులకు పునాదులు వేయాలి. పదవీ విరమణ తర్వాత ఎవరి మీదా ఆధారపడకుండా జీవించాలంటే ఇప్పటి నుంచే ఆలోచన మొదలవ్వాలి. అది చిన్న మొత్తంతో అయినా, క్రమంగా సాగితే పెద్ద భరోసాగా మారుతుంది.
ఈ ఐదు అంశాలూ వేరువేరుగా కనిపించినా, నిజానికి ఒకే గొలుసులోని లింకుల్లాంటివి. పొదుపు లేకుంటే బడ్జెట్‌ నిలబడదు, బడ్జెట్‌ లేకుంటే అప్పులు పెరుగుతాయి, అప్పులు పెరిగితే అత్యవసర నిధి కరిగిపోతుంది, ఇవన్నీ తారుమారైతే రిటైర్‌మెంట్‌ కలలాగే మిగులుతుంది. అందుకే డబ్బుతో పోరాటం చేయడంకంటే, దానితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. డబ్బు మన చేతిలో ఉన్నప్పుడే మన జీవితం మన నియంత్రణలో ఉంటుంది.
జపాన్‌లో డబ్బు జీవితానికి క్రమశిక్షణ నేర్పే సాధనంగా భావిస్తారు. పిల్లలకే చిన్న వయసులోనే ఖర్చు, పొదుపు లెక్కలు రాసుకునే అలవాటు పెంపొందిస్తారు. నెల మొదటే దాచుకుని మిగిలిన దానితో జీవించే పద్ధతి అక్కడ సాధారణం. అవసరం లేని ఖర్చు ఓటమిలాగా చూస్తారు. అందుకే అప్పుల ఒత్తిడి అక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది.
జర్మనీలో కుటుంబ బడ్జెట్‌ ఒక అలవాటు కాదు, ఒక జీవిత నియమం. ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చుల విభజన ఖచ్చితంగా జరుగుతుంది. విద్య, ఆరోగ్యం, ఇల్లు, రిటైర్‌మెంట్‌… ఇవే మొదటి ప్రాధాన్యాలు. సరదా ఖర్చులు వీటి తర్వాతే వస్తాయి. ఉద్యోగంలో అడుగు పెట్టినప్పటి నుంచే రాబోయే రోజులకు దాచుకోవాలన్న ఆలోచన అక్కడ బలంగా ఉంటుంది.
అమెరికాలో డబ్బు విషయంలో రెండు విభిన్న ధోరణులు కనిపిస్తాయి. ఒకవైపు పెట్టుబడులపై ఆసక్తి, మరోవైపు క్రెడిట్‌ అలవాటు. భవిష్యత్తు కోసం కొందరు బాగా ప్రణాళిక వేసుకుంటే, ఆకర్షణీయమైన ఆఫర్లు కొందరిని అప్పుల వైపు నెట్టేస్తాయి. అయినా అక్కడ ఆర్థిక అవగాహనపై నిరంతర చర్చ ఉండడం వల్ల చాలామంది తిరిగి సరిదారి పట్టగలుగుతున్నారు.
చైనాలో పొదుపు అనేది కుటుంబ భద్రతకు ఆధారం. పిల్లల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్యం, వద్ధాప్యం… ఈ మూడు లక్ష్యాల చుట్టూనే అక్కడ డబ్బు ప్రణాళిక సాగుతుంది. అత్యవసర నిధి ఉండడాన్ని గర్వంగా భావిస్తారు. మన దేశంలో మాత్రం సంప్రదాయాలు, పండుగలు, పరువు అనే భావనలు ఖర్చును నియంత్రించకుండా ముందుకు నడిపిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో పెట్టుబడులు, రిటైర్‌మెంట్‌పై ఆలోచించే యువత క్రమంగా పెరుగుతోంది.
దేశాలు వేరు అయినా, డబ్బు విషయంలో జీవితం చెప్పే పాఠం ఒక్కటే… ముందే ఆలోచించి నడిచినవాడే కలవరపడకుండా జీవిస్తాడు. పొదుపు, బడ్జెట్‌, నియంత్రిత అప్పులు, అత్యవసర నిధి, రిటైర్‌మెంట్‌పై ముందుచూపు… ఇవన్నీ కలిసి మనిషికి అసలైన స్వేచ్ఛను ఇస్తాయి. డబ్బు ఎక్కువగా ఉండటం కాదు, దానిని తెలివిగా నడిపించగలగడం జీవితాన్ని నిలబెట్టే నిజమైన బలం.

చిటికెన కిరణ్‌ కుమార్‌, 9490841284

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -