పియ్రమైన వేణు గీతికకు
నాన్న… ఇక్కడ ఎండలు తట్టుకోలేనంతగా ఉన్నాయి. అక్కడ ఇంతకంటే ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండు. ఇక్కడ పచ్చళ్ళు పెట్టుకునే హడావిడి మొదలైంది. నీకు ఏం కావాలో చెప్పు, చేసి వుంచుతాను. వచ్చినప్పుడు తీసుకుని వెళ్లొచ్చు.
సరే నాన్న! కిందటి ఉత్తరంలో పిల్లలకు నేర్పాల్సిన మంచి అలవాట్ల గురించి చెప్పాను. ఈ సారి కూడా అలాంటివే చెప్తాను. మంచి అలవాట్లు చాలా చాలా ఉంటాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి వయసుకు తగ్గట్టుగా చెప్తూ ఉండాలి.
కొందరి ఇళ్లల్లో చూస్తూ ఉంటాను స్నానం చేసి రాగానే టవల్ మంచం మీదనో, సోఫా మీదనో పడేసి వెళ్తుంటారు. అలా చేయకూడదని, స్నానం చేసి బట్టలు వేసుకున్న తర్వాత టవల్ ని బైట తీగ మీద ఆరేయాలని చెప్పాలి.
ఇవ్వాళ రేపు పిల్లలకు ఒక గది పెద్దలకు ఒక గది. గదిలో లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆర్పేయమని, అవసరం ఉన్నప్పుడే వేసుకోవాలని చెప్పాలి.
అలా వదిలేసినందు వలన జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియచేయాలి.
అలాగే పిల్లలకు మర్యాద కూడా నేర్పాలి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు లేచి నిల్చోవడం, నమస్కరించడం, వారిని ఇంట్లోకి ఆహ్వానించి, కూర్చోమని మంచినీళ్ళు తెచ్చి ఇవ్వడం లాంటివి నేర్పించాలి.
ఇంట్లోని పెద్దల కోసం వచ్చినట్లు అయితే వారు లోపల ఎక్కడో ఉంటే ‘ఒక క్షణం ఉండండి, నేను ఇంట్లో వాళ్లకు చెప్పి వస్తాను’ అని చెప్పటం నేర్పాలి.
కొందరు పిల్లలు ఇంటికి ఎవరైనా రాగానే ఎప్పుడూ లేని అల్లరి మొదలు పెడతారు, లేదా వచ్చిన వాళ్ళతో మాట్లాడనివ్వకుండా పేచీలు పెడుతుంటారు. పిల్లలకు ముందుగానే చెప్పాలి ఇంటికి తెల్సిన వాళ్ళు వస్తున్నారు, అల్లరి చేయకుండా, పేచీలు పెట్టకుండా ఉండు, లేకుంటే నీతో మాట్లాడను అని కొంచం భయ పెట్టాలి. కొన్ని చోట్ల భయపెట్టడం, కోప్పడటం, దెబ్బ వేయడం, బెదిరించడం పరిస్థితులను బట్టి తప్పని సరి అవుతుంది. ఎంతో ఓర్పు సహనం పిల్లల విషయంలో తప్పని సరి నాన్న. వాళ్లకు ప్రతిదీ నెమ్మదిగా, ప్రేమగా చెప్పాలి. సరే నాన్న ఉంటాను. మర్చి పోకుండా నీకు ఏమి కావాలో చెప్పు బంగారు తల్లి. అమ్మను కష్ట పెట్టకూడదు అని అనుకోకు. నీకు కాకపోతే ఎవరికి చేస్తాను చెప్పు.
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి
మంచి అలవాట్లు నేర్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



