Sunday, May 3, 2026
E-PAPER
Homeసోపతిశ్రామిక పోరాటాలే వేగు చుక్కలు

శ్రామిక పోరాటాలే వేగు చుక్కలు

- Advertisement -

బంగారక్క : వినరా కార్మిక వీరసోదరా విజయము నీదేరా
కేతిగాడు, జుట్టుపోలుగాడు : తందానా తందానా దేవనందనానా..
బంగారక్క : వినరా కార్మిక వీర సోదరీ విజయము నీదేలే
వంతలు : తందానా .. తందానా… దేవనందనానా…
బంగారక్క : అయ్యా ప్రపంచాన మే నెల1 ని మేడే పండుగ అన్నారే.. అట్టి మేడే పండుగను కార్మికులంతా దీక్షాదినముగ తలచేరే… దేవా…
జుట్టుపోలుగాడు : అక్కా! ఒక్క పక్క పండుగ అంటావ్‌! మరోపక్క దీక్షాదినం అంటావేంటి?
కేతిగాడు : మనలో కొందరు ఈ రెండింటిని వేర్వేరుగా చూస్తున్నారు.
జుట్టుపోలుగాడు : అవును. పండుగ పేరుతో కొందరు కోళ్లు, మేకలు కోసుకుని దావత్‌లంటూ డిజె సౌండ్‌ సిస్టమ్‌లతో బాగా తాగితందనాలు ఆడుతూ రాత్రింబవళ్లు లొల్లి చేస్తున్నారు.
కేతిగాడు : ఆకులేకుండా అన్నం తినడం అంటే ఇదే. స్ఫూర్తి మరచి గంతులేస్తే… నేల మీద మురికంతా నోట్లోకే పోతుంది. ఉన్న ఆ కాస్త ఆరోగ్యం చెడుతుంది.
బంగారక్క : అమెరికా, చికాగో నగరంలో 1886 మే 1 న కార్మిక రక్తంతో పుట్టిన ఈ ఎర్రజెండా… ‘కార్మికులు కూడా మనుషులేనని’ ఎలుగెత్తి చాటింది. వారికీ భార్యా పిల్లలు, కుటుంబ జీవితాలు వుంటాయని, రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారని, మరో ఎనిమిది గంటలు నిద్ర, మరో ఎనిమిది గంటలు స్వేచ్ఛగా, హాయిగా వారు కోరుకున్న విధంగా గడపవచ్చని, తద్వారా వారి ఆరోగ్యం కార్మిక శక్తి ఇనుమడిస్తుందని, మరల పనిలోకి ఉత్సాహంగా పోవడానికి తోడ్పడుతుందని మేడే చరిత్ర చెబుతుంది.
జుట్టుపోలుగాడు : అందుకే మేడేని విదేశీపండుగని, హిందువులంతా విశ్వకర్మ జయంతిని కార్మిక పండుగ్గా జరుపుకోబవాలని మా వాళ్లు అంటున్నారు.
కేతిగాడు : అరె తిక్కలోడా ఇలారారా. నీవు సెల్‌ఫోన్‌ వాడుతున్నావ్‌, కరెంటు వుపయోగిస్తున్నావ్‌. పెట్రోల్‌ లేకపోతే ముందుకు పోలేవు. వీటిని ఎవరు ఏ దేశంలో కనిపెట్టినా నీవు ఉపయోగించుకుంటున్నావు. అవునా. వాటిని వస్తువులుగా, సంపదగా, వుత్పత్తిగా మార్చేదే శ్రమశక్తి. అందుకే శ్రామికులు ఏ దేశంలో వున్నా ప్రపంచ మానవాళి అవసరాలు తీర్చేందుకు నిరంతరం కష్టపడుతుంటారు. ఈ వాస్తవాన్ని అంగీకరించనోళ్లే బుద్దిలేకుండా అడ్డదిడ్డంగా ఏదేదో వాగుతుంటారు.
బంగారక్క : ప్రపంచంలోని కార్మికులందర్ని ఒక్కటిగా చేసేది ఆ శ్రమశక్తే.
ఇద్దరూ : అవును. ఆ శ్రమశక్తే.
బగారక్క : ప్రపంచ కార్మికులారా…
ఇద్దరూ : ఏకం కండి.
బంగారక్క : పోయేదేమీ లేదు మనకు
ఇద్దరూ : బానిస సంకెళ్లు తప్ప.
బంగారక్క : ఆ బుద్దిలేని పెద్దలు – సై (వంతలు)
దోపిడీ గద్దలై – సై
ఆయుధాలే చేస్తూ – సై
అహ యుద్దాలే చేస్తూ – సై
విధ్వంసాలే సృష్టించరా – నరహంతకులగ మారేరా
ప్రజల ప్రాణాలే బలిగొన్నారా – ఈ పుడమిని మరుభూమిగ మార్చారా
వంతలు : బళానంటి భాయి తమ్ముడా మేలు భళానోయి దాదానా
తరిగిడి థింతరి తోం.
కేతిగాడు : వీరు ఎలాగు వుంటారంటే…
బంగారక్క : కోరలుండవు కొమ్ములుండవు – భళాభళి (వంతలు)
క్రూరమైన దోపిడి కోసం – భళాభళి
సామ్రాజ్యవాదపు నేతలయ్యారు – భళాభళి
బహుళజాతి కంపెనీలకు – భళాభళి
బడానేతలుగా చలామణి అయ్యారు – భళాభళి
మానవరక్తం రుచి మరిగారా – లాభాలవేటలో పడ్డారా
వంతలు : లాభాల వేటలో పడ్డారా
బంగారక్క : గనులు, నదులు కావాలి వీరికి – తందానతాన
కొండలు, కోనలు కావాలి వీరికి – తందానతాన
చమురు, సహజ వాయువు కావాలి వీరికి – తందానతాన
దేశాలేమైనా పట్లదు వీరికి – తందానతాన
ప్రజలు చచ్చినా సరే పట్టదు వీరికి – తందానతాన
భూగోళం నాశనమైనా సరే పట్టదు వీరికి – తందానతాన
జట్టుపోలుగాడు : అంతా నాశనమయ్యాక మరి వీరెలా బతుకుతారు?
కేతిగాడు : అవును వీరెలా బతుకుతారు?
బంగారక్క : అందుకే మార్క్స్‌ మహనీయుడు ఏనాడో చెప్పాడు. పెట్టుబడి అనేది శ్రమ ఫలితం. లాభాల వేటలో పెట్టుబడిదారుడు శవపేటికల ఉత్పత్తికీ వెనుకాడడు. దోపిడీ వ్యవస్థలో లాభం పెట్టుబడిగా, ఆ పెట్టుబడే రానురాను దేశాలను కబళించే సామ్రాజ్యవాదంగా, బహుళజాతి కంపెనీలుగా, కార్పొరేట్‌ శక్తులుగా ఎదుగుతున్న దశలో మనం వున్నాం. వీరి అమానుష దుర్మార్గాలకు అంతిమంగా బలైపోతున్నది మన కార్మికులే. శ్రమజీవులే.
కేతిగాడు : దీనికి అంతం ఎలా అమ్మీ?
బంగారక్క : కార్మిక వర్గాన్ని దగ్గరగా చూస్తుంటే ఒకటి అర్థమవుతుంది. జీవన్మరణ పోరాటంలో వారెప్పుడూ ముందే వుంటారు. ఉత్తర భారతం నోయిడా ఫ్యాక్టరీ కార్మికులైనా, మన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ అయినా తెగించి పోరాడతారు. సమ్మె హక్కులతో సహా అన్నీ హక్కులూ సాధించుకుంటారు. పాలక వర్గాలు, కార్పొరేట్‌లు ఎన్ని మాయ మాటలు చెప్పినా, లేబర్‌ కోడ్‌ల పేరుతో హక్కులు హరిస్తున్నా కళ్లప్పగించి చూస్తూ ఊరుకోరు. కళ్లు తెరిచి కదన రంగానికి ఉరుకుతారు. ఆ శ్రామిక వర్గ పోరాటాలే మానవ మనుగడకు వేగు చుక్కలై నిలుస్తాయి.
ముగ్గురూ పాట : అబ్బబ్బ మన రక్త మాంసాలు హరించి ఎందరో తెగబలిశారు. ప్రజల అశాంతికి కారణమగు ఈ రక్త పిపాసుల పీడ వదిలితే దేశమంతటా శాంతి తేజమే. దిక్కుదిక్కుల ఆనందమే. ఆకలి మంటలు మలమలలాడే అనాధలందరు లేవండోరు.

  • కె.శాంతారావు, 9959745723
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -