నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కిశోర బాలికల కోసం ‘స్నేహ సమ్మర్ క్యాంప్స్’ ఘనంగా ప్రారంభమయ్యాయి. సెర్ప్ ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా అమలవుతున్న ఈ సమ్మర్ క్యాంపుల్లో పెద్ద సంఖ్యలో టీనేజ్ బాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మే 2 నుంచి జూన్ 10 వరకు నిర్వహించబడుతున్న ఈ క్యాంపులు కిశోర బాలికల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించారు. వివిధ సెషన్ల ద్వారా బాలికలకు ఆరోగ్యం, భద్రత, విద్య, జీవన నైపుణ్యాలు (లైఫ్ స్కిల్స్)పై అవగాహనను కల్పిస్తున్నారు. క్యాంప్‌లో భాగంగా బాల్య వివాహాల నిర్మూలన, రక్తహీనత (అనీమియా) వంటి ఆరోగ్య సమస్యలు, గ్రామాలను బాలికలకు సురక్షిత ప్రాంతాలుగా తీర్చిదిద్దే చర్యలు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అదే విధంగా బాలికలు ఎదుర్కొనే వ్యక్తిగత, సామాజిక సవాళ్లను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలపై అవగాహన పెంపొందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ అలవాట్లు, పొదుపు ప్రాముఖ్యత, శారీరక వ్యాయామం, క్రీడలు, యోగా వంటి అంశాలపై కూడా శిక్షణ ఇస్తున్నారు. విద్య ప్రాముఖ్యత, కెరీర్ మార్గదర్శకత్వం, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు. సైబర్ భద్రత, స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు, బాలికల స్వతంత్రతను పెంపొందించే కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాల బాలికలకు సైకిల్ తొక్కే శిక్షణ ఇవ్వడం ద్వారా వారి సాధికారతకు దోహదం చేస్తున్నారు. క్యాంప్ ముగింపు సందర్భంగా తల్లిదండ్రులను ఆహ్వానించి కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించడంతో పాటు, పిల్లల గ్రామ సభ ద్వారా బాల్య వివాహాల నిరోధం, బాలికల భద్రత, విద్య ప్రోత్సాహం వంటి అంశాలపై గ్రామ స్థాయి నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. కీలక శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ స్నేహ సమ్మర్ క్యాంప్స్ ద్వారా కిశోర బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తు నిర్మాణం లక్ష్యంగా పని చేస్తున్నారు.
కిశోర బాలికల కోసం ‘స్నేహ సమ్మర్ క్యాంప్స్’ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



