క్షేత్రస్థాయిలో అసంపూర్తి పనులు
ట్రై-సిటీస్‌లో ముంచుకొస్తున్న వానాకాలం
ముంపు కాలనీల్లో తీరని నాలాల తిప్పలు
రూ. 4,170 కోట్ల యూజీడీ పనుల్లో జాప్యం
వికాస్‌నగర్, కడిపికొండల్లో
మృత్యుకుహరాల్లా ప్రభుత్వ క్వార్టర్లు
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పేదల జాగారం
నవతెలంగాణ-నయీంనగర్/నక్కలగుట్ట/కాజీపేట
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ మహానగర (ట్రై-సిటీస్) సమగ్ర అభివృద్ధి కోసం, దశాబ్దాల నాటి వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం దాదాపు రూ.5,000 కోట్లతో భారీ కార్యాచరణను ప్రకటించింది. ఇందులో అత్యంత కీలకమైన భాగం.. నగరంలో ప్రతి వర్షాకాలం తలెత్తే జలదిగ్బంధం నుంచి విముక్తి కల్పించేందుకు రూ.4,170 కోట్లతో చేపట్ట తలపెట్టిన సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ ప్రాజెక్టు, ప్రధాన నాలాల పునరుద్ధరణ పనులు నిధుల కేటాయింపులు కాగితాలపై బ్రహ్మాండంగా కనిపిస్తున్నా, ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అత్యంత దయనీయంగా మారాయి. వరంగల్ నగరంలోనే అత్యంత కీలకమైన నయీంనగర్ ప్రధాన నాలాపై కొత్త వంతెన విస్తరణ పనులు సగమే పూర్తయ్యాయి. వానాకాలం ముంచుకొచ్చినా ఇరువైపులా రిటైనింగ్ వాల్స్, కనెక్టివిటీ పనులు పూర్తి కాకపోవడంతో వరద నీరు వెనక్కి తన్ని కాలనీలను ముంచెత్తుతోంది. అలాగే, కాజీపేట-హనుమకొండ సరిహద్దుల నుంచి వచ్చే భారీ ప్రవాహానికి తగ్గట్టుగా ఇక్కడి ఇరుకైన కల్వర్టులను వెడల్పు చేయాల్సి ఉండగా, బఫర్ జోన్లలోని ఆక్రమణల తొలగింపు జరగక ఈ పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
భద్రకాళి సబ్‌స్టేషన్ ఏరియా, సాకరాసికుంట వద్ద లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు భద్రకాళి వైపు సజావుగా వెళ్లే జంక్షన్ వద్ద బాటిల్‌నెక్స్ తొలగించే పనులు, కల్వర్టు పునర్నిర్మాణం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన గోపాల్‌పూర్, వడ్డేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ వరద కాలువ పనులు కొన్ని కీలకమైన జంక్షన్ల వద్ద కనెక్ట్ కాకుండా అర్ధాంతరంగా ఆగిపోవడంతో నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఒకవైపు అసంపూర్తి డ్రయినేజీలు, నిలిచిపోయిన కల్వర్టుల పనులతో ముంపు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటుంటే.. మరోవైపు కాలం చెల్లిన ప్రభుత్వ క్వార్టర్లు, ఇందిరమ్మ నివాసాలు ఎప్పుడు కూలుతాయో తెలియని ప్రమాదకర స్థితికి చేరాయి. ఈ వర్షాకాలంలో ట్రై-సిటీస్ పరిధిలోని ప్రధాన ముంపు ప్రాంతాలు, నిలిచిపోయిన కల్వర్టు పనులు, శిథిలావస్థకు చేరిన నివాస సముదాయాలతో జనం భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. వికాస్‌నగర్ శ్మశాన వాటిక పక్కన క్వార్టర్స్‌లోని ప్రభుత్వ భవనాలు పూర్తిగా కాలం చెల్లిపోయి, అస్థిపంజరాల్లా దర్శనమిస్తున్నాయి. వర్షపు నీరు గోడల్లోకి ఇంకిపోయి కాంక్రీట్ పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి నెలకొంది.
చుట్టూ డ్రయినేజీ సౌకర్యం లేకపోవడంతో శ్మశాన వాటిక పరిసరాల మురుగునీరంతా ఇండ్ల చుట్టూ చేరి కంపు కొడుతోంది. అలాగే, కడిపికొండలో పేదల సొంతింటి కల కోసం నిర్మించిన ఈ ఇందిరమ్మ క్వార్టర్స్ సరైన నిర్వహణ లేక ఏటా వర్షాకాలంలో నరకాన్ని తలపిస్తున్నాయి. నాణ్యతా లోపానికి తోడు వాన నీరు నిల్వ చేరడంతో పిల్లర్లు బలహీన పడ్డాయి. ఇక్కడి అంతర్గత డ్రయినేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడంతో వరద నీరు భవనాల పునాదులను గుల్ల చేస్తోంది. నగరంలోనే అత్యంత పాతవైన హౌసింగ్ బోర్డు క్వార్టర్లలోని పలు బ్లాకులు ధ్వంసమయ్యాయి. గోడలపై పెద్ద పెద్ద వృక్షాలు సైతం మొలిచి భవనాలు చీలిపో తున్నాయి. ప్రస్తుత వర్షాలకు ఈ భవనాలు ఎప్పుడు కూలిపోతాయోనని చుట్టుపక్కల కాలనీల ప్రజలు సైతం భయాందోళన చెందుతున్నారు.
యూజీడీ నెట్‌వర్క్ ఎటు పోయింది?
రూ. 4,170కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ వ్యవస్థకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ, సర్వేలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ప్రధాన పైప్‌లైన్ల నెట్‌వర్క్ నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో వేగం అందుకోవాల్సి ఉంది. ఒకవైపు మామ్నూర్ ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ, టెక్స్‌టైల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టుల ఊసెత్తుతున్న పాలకులు.. నగర ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న డ్రయినేజీ, నాలాల వ్యవస్థను ఎందుకు గాలికొదిలేశారని విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాం గం యుద్ధప్రాతిపదికన స్పందించి ఈ శిథిల క్వార్టర్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నిలిచిపోయిన కల్వర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయా లని మేధావులు, నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.


