వడోదర ఎంఎస్‌యూలో కొత్త సోషియాలజీ కోర్సులు
తప్పుబడుతున్న విద్యావేత్తలు, మేధావులు
సిలబస్ పునర్‌వ్యవస్థీకరణపై విమర్శల వెల్లువ
వడోదర : దేశంలో విద్యను కాషాయికరించడంలో మోడీ సర్కారు ఇప్పటికే పలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) తీసుకొచ్చి ఇప్పటికే వివాదాన్ని రాజేసింది. ఇదే ఎన్‌ఈపీని ఆధారంగా చేసుకొని దేశంలో విద్యా స్వేచ్ఛను హరించేస్తోంది. తన కాషాయ సిద్ధాంతాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ జోక్యాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇందుకు బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్‌లోని మహారాజ్ సయాజీరావ్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా (ఎంఎస్‌యూ) సోషియాలజీ విభాగం ప్రవేశపెట్టిన కొత్త కోర్సులే నిదర్శనం. ఇందులో ‘మోడీతత్వం’, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆరెస్సెస్)పై ఫీల్డ్ స్టడీ, హిందూ సోషియాలజీ, దేశభక్తి వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి. దీంతో ఎంఎస్‌యూ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఓ కేస్ స్టడీగా మోడీ నాయకత్వం
ఈ కొత్త కోర్సులు బీఏ సోషియాలజీ నాలుగో సంవత్సరం, ఎంఏ సోషియాలజీ మొదటి సంవత్సరంలో భాగంగా అమలు కానున్నాయి. సోషియాలజీ ఆఫ్ భారత్, హిందూ సోషియాలజీ, సోషియాలజీ ఆఫ్ పాట్రియాటిజం అనే మూడు ప్రధాన కోర్సులు నాలుగు క్రెడిట్లతో ప్రవేశపెట్టారు. మోడీ తత్వం అనే మాడ్యుల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఒక కేస్ స్టడీగా పరిశీలిస్తారు. జర్మన్ సోషియాలజిస్ట్ మాక్స్ వెబర్ ప్రతిపాదించిన ‘కరిష్మాటిక్ అథారిటీ’ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని ఈ అధ్యయనాన్ని రూపొందించారు.
ఆరెస్సెస్‌ను సామాజిక సంస్థగా చూస్తాం : సోషియాలజీ విభాగాధిపతి వీరేంద్ర సింగ్
యూనివర్సిటీ సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్. వీరేంద్ర సింగ్ ప్రకారం.. ”మోడీతత్వ ద్వారా ఆధునిక రాజకీయ నాయకత్వం, ప్రజలతో సంబంధం, పాలసీ ప్రభావం వంటి అంశాలను సోషియాలజీ దృష్టిలో అధ్యయనం చేయడం లక్ష్యం” అని తెలిపారు. 50 ఏండ్ల తర్వాత విశ్లేషించడం కంటే ఇప్పుడే విద్యార్థులు అధ్యయనం చేయాలని ఆయన చెప్పారు. కోర్సులో ఆరెస్సెస్ కార్యకలాపాలను కూడా చేర్చారు. గ్రామీణ గుజరాత్‌లో ఫీల్డ్‌వర్క్ సమయంలో ఆరెస్సెస్ ప్రభావం కనిపించడంతో దీనిపై అధ్యయనం చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. ఆరెస్సెస్ ఒక ప్రభుత్వ సంస్థగా లేదా ఎన్జీఓగా వర్గీకరించలేమనీ, కానీ సామాజిక స్థాయిలో ప్రభావం చూపుతోందని చెప్పారు. అందుకే దీనిని సామాజిక సంస్థగా అధ్యయనం చేస్తామని ఆయన వివరించారు. కోర్సులో సయాజీరావ్ గైక్వాడ్ 3, సర్దార్ వల్లభభారు పటేల్, బీ.ఆర్.అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్ వంటి ప్రముఖుల నాయకత్వం, సామాజిక సంస్కరణలు కూడా భాగం కానున్నాయి. సోషియాలజీ ఆఫ్ భారత్ కోర్సులో భారతీయ వ్యవస్థలపై అధ్యయనం ఉంటుంది. భారతీయ నాగరికతకు సంబంధించిన మూలాలను విద్యార్థులకు పరిచయం చేయడం దీని లక్ష్యం. అయితే ఈ కొత్త కోర్సులు అకాడమిక్ స్వతంత్రత, రాజకీయ ప్రభావం వంటి అంశాలపై చర్చకు దారి తీస్తున్నది.
తాజా నిర్ణయంపై విమర్శల వెల్లువ
ఎంఎస్‌యూ నిర్ణయం విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా ‘మోడీ తత్వం’ అనే అంశం, విద్యా వ్యవస్థలో రాజకీయ ప్రభావం పెరుగుతోందనే ఆందోళనలను కలిగిస్తున్నాయి. వాస్తవానికి సోషియాలజీ అనేది సమాజాన్ని విమర్శనాత్మకంగా, తటస్థంగా విశ్లేషించే శాస్త్రం. కానీ ప్రస్తుతం దేశ ప్రధానిగా ఉన్న, ఒక పార్టీకి చెందిన నరేంద్ర మోడీని కేస్ స్టడీగా చేర్చడం తప్పుడు సందేశాన్ని తీసుకెళ్లే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకుడి నాయకత్వాన్ని అధ్యయనం చేయడం, అకాడమిక్ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన కంటే వ్యక్తి కేంద్రీకృత దృక్పథాన్ని ప్రోత్సహించే ప్రమాదం ఉందని విశ్లేషకులు, విద్యావేత్తలు చెప్తున్నారు.
మోడీతత్వం.. ఆరెస్సెస్..హిందూయిజం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



