– నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి
నవతెలంగాణ- కంఠేశ్వర్: ఎన్నికల ప్రవర్తన నియమావళిలో తెలియజేసిన నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీలవారు వ్యక్తులపై తేది 9-10-2023 నుండి తేది 14-11-2023 వరకు మొత్తం ఎన్నికల కేసులు 25 నమోదు చేయడం జరిగింది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మంగళవారం ప్రకటనలో వెల్లడించారు. ఇందులో ప్రధానంగా మతాలను రెచ్చగొట్టే విధంగా ఉపాన్యాసం, ప్రార్థన స్థలాలకు సంబంధించిన ప్రదేశాలను ఉపయోగించి ప్రచారం చేయడం జరిగిందని, పార్టీ పేరుతో సర్వేలు నిర్వహించి తమ పార్టీ వారికి ఓటు వేయాలని తెలిపిన వారిపై,డబ్బులు పంపిణి చేస్తున్నవారిపై, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న వారిపై, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్గించే వారిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేయడం జరిగింది అని వివరించారు. నమోదయిన వాటిలో కొన్ని ఎన్నికల కేసుల వివరాలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలియజేశారు. నవిపేట (మం) రాంపూర్ చౌరస్తాలో ఒక రాజకీయ పార్టీ కార్యవర్గ సభ్యుడు మరియు 8 మంది అనుచరులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందులకు కేసు నమోదు చేయడం జరిగింది. సర్వేలు నిర్వహించినందులకు బోధన్ టౌన్, బోధన్ రూరల్, నిజామాబాద్ టౌన్, ఆర్మూర్లో రాజకీయ పార్టీ అనుమతి లేకుండా ప్రైవెయిట్ ఏజన్సీల ద్వారా సర్వే నిర్వహిస్తున్నప్పుడు ప్రజలు వీటిపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన సందర్భంలో 26 మంది పై కేసులు నమోదు చేయడం జరిగింది. బోధన్ టౌన్ లో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థి శుక్రవారం నాడు జుమ్మ ప్రార్ధన సమయంలో మజీదులో ప్రచారం నిర్వహించినందులకు కేసు నమోదు అయినది. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని అలూర్ గ్రామ పంచాయితీ వద్ద రాత్రి సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కు సంబంధించిన ఎన్నికల అధికారి తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక కారును ఆపి తనిఖీ చేయగా అట్టి వాహనంలో ఉన్న వారు తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందికి విధులకు ఆటంకం కలిగించినందులకు కేసు నమోదు చేశారు. ఎడపల్లి ( మం ) అశోక్ పార్కు నెహ్రూ నగర్లో ఒక రాజకీయ పార్టీకి చెందిన వారు ఎలాంటి అనమతి లేకుండా సమావేశం నిర్వహించడంతో పాటు డబ్బులు పంపిణి చేయడం వలన కేసు నమోదు చేయడం జరిగింది. ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద ఒక రాజకీయ పార్టీకి చెందిన కారు హైదరాబాద్ నుండి నిర్మల్ వైపు వస్తునప్పుడు తనిఖీలు చేయగా అందులో మతదారులకు ప్రభావితం చేయడం కోసం పార్టీ పేరుతో ప్రింట్ అయిన బొట్టుడబ్బలు ఉన్నందున కేసు నమోదు చేయడం జరిగిందని క్లుప్తంగా వివరించారు.కావున ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, ఏ పార్టీవారయిన, ఏ వ్యక్తులయిన ఎవ్వరయిన ఎలాంటి చర్యలకు పాల్పడిన ఎన్నికల ప్రవర్తన నియమావళి చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు.