సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి కి నివేదిస్తాం

– జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

నవతెలంగాణ- కంటేశ్వర్
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డికి నివేదిస్తాం అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద గత మూడు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఆయన సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల శ్రమ విలువైనదని వారు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవని ఆయన అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు తొలగి వారి జీవితాల్లో వెలుగులు నిండాలనే ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని ఆ ఉద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమదైన పాత్ర పోషించారని కానీ స్వరాష్ట్రం వచ్చి దాదాపు దశాబ్దం గడుస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాకపోగా ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం వారి జీవితాలు మరింత దయనీయంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వారి జీతాలు గాని ఇతరత్రా ఉద్యోగ ప్రయోజనాలు మరియు సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్  ఆ హామీని గాలికి వదిలేసారని, గత ప్రభుత్వాల హయాంలో ఏ శాఖలో నైనా ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ధర్నా చేస్తే ప్రభుత్వాలు మూడు నుండి నాలుగు రోజుల్లో స్పందించి వాటిని పరిష్కరించే దిశగా పనిచేసేవని కానీ స్వరాష్ట్రంలో మాత్రం నెలల తరబడి సమ్మెలు దీక్షలు పోరాటాలు చేసిన ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు భవిష్యత్తులో వారు తీసుకోబోయే కార్యచరణకు కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మరియు ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా నాయకులు అష్రాఫ్ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love