పాటల యుద్ధనౌక గద్దర్ కు ఘన నివాళి!

నవతెలంగాణ -కంటేశ్వర్
పాటల యుద్ధనౌక గద్దర్ కు నిజామాబాద్ జన సాంస్కృతిక కళావేదిక, అరుణోదయ, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ ఐఎఫ్టియు ఆఫీసులో గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి,నివాళి అర్పించారు. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ప లింగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ.. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే భావంతో పాటను ఆయుధంగా మలిచి పాలకుల నిరంకుశత్వాన్ని, పెత్తాందారి విధానాలను ఎదిరించి, ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి కృషిచేసిన గద్దర్ ప్రజా కళాకారులకు స్ఫూర్తీ దాయకమని వారు అన్నారు. మాభూమి సినిమాలో సాయయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో, జై బోలో తెలంగాణ సినిమాలో నటించడమే కాకుండా, వందలాది పాటలను ప్రజావాణిలో కైగట్టి పాడి, ఆడి ప్రజల్ని వెన్ను తట్టిన నిజమైన ప్రజాకవి గద్దర్ అని వారు కొనియాడారు. తన వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా నొప్పిని లెక్కచేయకుండా, ప్రజాపాటలకు ప్రాణం పోసిన గద్దర్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని వారన్నారు. భారతదేశంలో ఒక ప్రజా కళకారుడుగా గద్దర్ గుర్తింపు పొందాడని, అనేకమంది గాయకులకు ప్రేరేపించి, పురుడు పోసిన గద్దర్ మరణం తీరని లోటని వారు అన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. గద్దర్ పై హత్యా ప్రయత్నాలు జరిగిన, అదిరింపులకు బెదిరింపులకు భయపడక ప్రజా గొంతుకై నిలిచారని వారు తెలిపారు. తాను ప్రారంభంలో తీసిన పాటల ఆల్బమ్ గద్దర్ పేరే నామకరణంగా మారిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే అబ్దుల్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు జెల్లామురళి , కార్యదర్శి శివకుమార్, ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ,పి వై ఎల్, అరుణోదయ జిల్లా నాయకులు ఎం.సంజీవ, బండమీది నరసయ్య కళాకారులు సంశోద్దీన్, డప్పు నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love