నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ బస్టాండ్ భూముల పరిరక్షణతో పాటు నూతన బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు డీసీసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు వరంగల్‌లో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవాని ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్‌ఎం, భూపాలపల్లి డీఎం తదితర సంబంధిత అధికారులతో కాటారం బస్టాండ్ స్థలం, నిర్మాణ పనులపై సమగ్రంగా చర్చించారు.
ప్రస్తుతం భూమికి సంబంధించిన కేసు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి త్వరితగతిన క్లియరెన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. క్లియరెన్స్ లభించిన వెంటనే బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా, బస్టాండ్ నిర్మాణంతో పాటు భూమి పరిరక్షణ కోసం కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని, లీగల్ క్లియరెన్స్ అనంతరం వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధన్వాడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మకూరి కుమార్, యాదవ్ పున్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు.



