గడువులోగా పూర్తి చేయాలి : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
మహిళాశక్తి చీరల ఆర్డర్ కార్యక్రమం
హాజరైన హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కోటి చీరల ఆర్డర్ ఇచ్చిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమకు ప్రజా ప్రభుత్వం కోటి చీరల ఆర్డర్‌ను అందజేసే కార్యక్రమాన్ని రాజన్నసిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యేతోపాటు చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై నూతన రంగుల చీరలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతేడాది 6 కోట్ల 85 లక్షల మీటర్ల ఆర్డర్ అందజేసిందని, ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 130 మ్యాక్స్ సంఘాలతో పాటు కరీంనగర్ జిల్లా గర్షకుర్తి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి జిల్లాలకు కలిపి మొత్తం 7 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చిందని వివరించారు.
వీటిలో 95 లక్షల చీరలు (6.3 మీటర్ల పొడవు), 5 లక్షల చీరలు (9 మీటర్ల పొడవు) ఉన్నాయని తెలిపారు. వస్త్ర పరిశ్రమ సంక్షేమం, ఆర్థిక వృద్ధికి ఈ ఆర్డర్లు ఎంతో మేలు చేస్తాయని వెల్లడించారు. గత ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ పూర్తి చేసిన వస్త్ర పరిశ్రమ బాధ్యులను అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి బాటలో ముందుకెళ్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల చీరలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు, గోచి చీరలు 5 లక్షలు మొత్తం కోటి చీరలు ఆర్డర్ ఇచ్చినట్టు వివరించారు. ఇప్పటికే బకాయి ఉన్న దాదాపు రూ.352 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడేలా వేములవాడలో రూ.50 కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి యారన్ బ్యాంక్ ఏర్పాటు చేశారని, 90 శాతం క్రెడిట్‌పై యార్న్ ఇస్తున్నారని తెలిపారు. పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నేతన్నకు భద్రత కింద రూ.5 లక్షల బీమా ప్రజా ప్రభుత్వం చెల్లిస్తోందని, అలాగే చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు.
హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి చీరలు నాణ్యతగా ఉన్నాయని, రానున్న ప్రభుత్వ ఆర్డర్లు కూడా నిబంధనల ప్రకారం నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. సిరిసిల్ల, ఇతర ప్రాంతాల వస్త్ర పరిశ్రమ బాధ్యులు సొంతంగానే చీరలు, ఇతర వస్త్రాలు నేస్తూ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. మిగతా యజమానులు, ఆసాములు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా శక్తి చీరల ఆర్డర్ల వల్ల పరిశ్రమకు 6 నుంచి 7 నెలలపాటు ఉపాధి అవకాశం ఉంటుందని వెల్లడించారు. వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు కేవలం ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడకుండా యారన్ బ్యాంక్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడూ మార్కెట్లో వస్తున్న మార్పులను గమనిస్తూ ముందుకు సాగాలన్నారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. స్థానిక వస్త్ర పరిశ్రమలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలు పండుగలు, ఇతర కార్యక్రమాల్లో మహిళలు ధరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్మికుల శ్రమ, పనితనానికి ఈ చీరలు గుర్తుగా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్లు స్వరూప, రాములు నాయక్, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వరరావు, ఏడీ సంతోష్, వివిధ జిల్లాల నుంచి వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు పాల్గొన్నారు.



