Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎగువ నుంచి రాని వరదలు

ఎగువ నుంచి రాని వరదలు

- Advertisement -

జూరాలాకు నీరెలా ? శ్రీశైలానికి చేరని చుక్కనీరు రిజర్వాయర్లకు ఎల్‌నినో ప్రభావం
ఖరీఫ్‌పై
తీవ్ర ప్రభావం ఆందోళనలో అన్నదాతలు

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎల్‌నినో ప్రభావం ఉమ్మడి పాలమూరుపై తీవ్రంగా పడింది. కృష్ణా, తుంగభద్ర నదులపై ఆధారపడి నిర్మాణం చేసిన రిజార్వాయర్లు పాతాళానికి పడిపోయాయి. ఇప్పటి వరకు జూరాల, శ్రీశైలానికి వరద జలాలు రాకపోవడంతో ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతేడాది కంటే ఈసారి వర్షాలు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాలేదు. కృష్ణా, తుంగభద్ర పరివాహక ఎగువ ప్రాంతాల్లోనూ సరిపడ వర్షాలు కురవట్లేదు. దిగువకు ఆశించిన మేర కూడా వరదల్లేకపోవడంతో పాలమూరు జలాశయాలు అడుగంటిపోయే పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే పాలమూరులో మళ్లీ వలసలు తప్పవా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరో పక్క సాగునీటితో పాటు తాగునీటికీ కష్టాలు ఎదురయ్యే అవకాశముంది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు పత్య్రామ్నాయ పంటల్ని సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు పడకపోవడంతో శ్రీశైలం, జూరాల రిజర్వాయర్ల నీటి మట్టాలు తగ్గిపోయాయి. గతేడాది ఇదే రోజుతో పోలిస్తే శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం భారీగా తగ్గింది. శ్రీశైలంలో గత ఏడాది జులై 7న సుమారు 190 టీఎంసీలకు పైగా నీటి నిల్వలుండగా, నేడు 42.21 టీఎంసీలకు పడిపోయాయి. ఎగువన ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆగస్టులోనైనా వర్షాలు పడకుంటే…ఖరీఫ్‌లో వరి సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, గతేడాది కంటే ఈ సారి నీటి మట్టం గణనీయంగా పడిపోయింది.

కేవలం 19.56శాతం నీటి నిల్వలే ఉన్నాయి.
జూరాల రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి నిల్వ సుమారు 7.2 టీఎంసీలు ఉండగా, గతేడాది ఎగువన కురిసిన వర్షాల వల్ల ఇదే రోజున ప్రాజెక్టులో సుమారు 8.86 నుంచి 8.92 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం నైరుతిపవనాల మందగమనం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం రాకపోవడంతో నీటి మట్టం గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ప్రస్తుత సీజన్‌ పరిస్థితులు గత సంవత్సరంతో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. నేటి తాజా పరిస్థితి చూస్తే జలాశయంలో సుమారు 7.20 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

ఇన్‌ఫ్లో పరిస్థితి పరిశీలిస్తే..
కృష్ణా, భీమా పరివాహక ఎగువ ప్రాంతాల్లో జూన్‌ నెలలో వర్షాలు తక్కువ పడడంతో ఇన్‌ఫ్లో నామమాత్రంగా కూడా కొనసాగట్లేదు. సాధారణ వరదలైనా రాకపోతే రిజర్యాయర్లు వట్టిపోయే అవకాశాలున్నాయి. జూన్‌ నెల రుతుపవనాల జోరు మందగించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. జులై మొదటి వారంలోనూ సరిపడ వర్షాలు పడలేదు. చిన్నపాటి వర్షాలే కురుస్తున్నాయి. ఆగస్టులోనైనా భారీ వర్షాలు కురిస్తే తప్ప కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు సరిపడ నీరొచ్చే అవకాశంలేదు.

పాలమూరులో కరువు ఛాయలు
పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు రాలేదు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఉమ్మడి జిల్లాలో 18 లక్షల ఎకరాలల్లో వివిధ రకాల పంటలు సాగయ్యేది. ఈసారి ఇప్పటి వరకు ఆరు లక్షల ఎకరాలు కూడా సాగు కాలేదు. ముఖ్యంగా వర్షాలు రాకున్నా .. గతంలో కృష్ణానది పారేది. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో కృష్ణానదిలో సైతం వరదలు రాలేదు. వరదలు రాకుంటే కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చే అవకాశాలు లేవు. వనపర్తి జిల్లాలో అయితే సప్త సమద్రాలు ఉండేవి. వీటిలో ఉన్న నీరు ఇప్పటికే అడుగంటాయి. ఇక వర్షాలు రాకుంటే రిజర్వాయర్లు నిండకుంటే పచ్చని పాలమూరు భూములు బీళ్లుగా మారే అవకాశాలు ఉన్నాయని రైతు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

​వ్యవసాయధారులకు అవగాహన కల్పించాలి:లక్ష్యయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్‌
​జిల్లాలో అత్యల్ప వర్షాపాతమే నమోదవుతోంది. కృష్ణానదిలోకి నీరు రావడం లేదు. రిజర్వాయర్లు వెలవెల బోతున్నాయి. అందుకే తక్కువ వర్షపాతానికి దిగుబడి వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలి. రైతులకు సరైన అవగాహన కల్పించి వ్యవసాయ అధికారులు సహకరించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించాలి.

​తక్కువ వర్షంతో సాగయ్యే పంటలపై దృష్టి పెట్టాలి : కృష్ణ, ఏడీఆర్‌, పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రం
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితితో పంటలకు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే రైతులు ఖరీఫ్‌లో తక్కువ నీటితో సాగయ్యే పంటలనే విత్తుకోవాలి. లేనిచో రైతులు తీవ్రంగా నష్టపోతారు. వరికి ఇంకా సమయం ఉంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు కురిసే అవకాశం ఉంటది. అప్పడయినా వరిని విత్తుకునే అవకాశముంది. ఇప్పుడు వరి నారుమళ్లు వేసుకుని ఆగస్టులో విత్తుకుంటే మంచిది. రైతులు ప్రత్యామ్నాయ పంటలే ఎంచుకోవాలి.

​వలసలు తప్పవా..?
వలసల జిల్లాగా పేరున్న పాలమూరుకు కృష్ణానది ద్వారా నీరందడంతో కొంత ఊపిరిపోసింది. పంట పొలాలకు సాగునీరు మల్లింది. సాగునీటి వనరులతో పంటల సాగు పెరడం వల్ల పాలమూరు నుంచి వలసలు తగ్గాయి. అయితే ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులేర్పడినందున పాలమూరు పరిస్థితి యాధాస్థితికి చేరే అవకాశాలున్నాయనే చర్చ ఉంది. మల్లీ వలసలు తప్పవా అన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నీటి వనరులు వట్టిపోతే మత్స్య సంపద పై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఫలితంగా చేపల వేట జీవనాధారంగా బతికే మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -