సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి : పాలడుగు భాస్కర్
నిజామాబాద్‌లో ‘లేబర్ కోడ్స్.. కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు
నవతెలంగాణ-కంఠేశ్వర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ‘లేబర్ కోడ్స్-కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రూపుమాపి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చారని అన్నారు. ఈ కోడ్‌లు కార్మికుల హక్కులను కాలరాసి.. పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా మారాయని తెలిపారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు లేకుండా రూపొందించబడ్డాయని విమర్శించారు. అదేవిధంగా కార్మికుల పనిగంటలను పెంచుతూ కార్మికులను బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయన్నారు. కష్టపడి పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వారి జీవితాలకు భద్రత లేకుండా ఈ కోడ్లను రూపొందించారని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశభక్తులమని చెప్పుకొని.. ఈ దేశంలోని ప్రజలను బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
కార్మికుల శ్రమతో పెట్టుబడుదారుల జేబులు నింపి దానినే దేశభక్తి అని చాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వం నిరంతరం జాతీయ సంపదపై దోపిడీ చేస్తోందని.. చివరికి అయోధ్య రామ మందిరాన్ని కూడా వదలకుండా రాముని కానుకలను సైతం దోచుకుంటున్నారని అన్నారు. మరోవైపు నిరంతరం భారత దేశ సంపదను, అడవులను, బొగ్గు గనులను, ఎల్‌ఐసీ, బ్యాంకులను లూటీ చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి ప్రజా ద్రోహులకు కార్మికులు ఐక్యమత్యంతో ఎదిరించి ఈ దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రమ, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, జిల్లా అధ్యక్షులు జె.శంకర్‌గౌడ్, ఉపాధ్యక్షులు ఏ రమేష్‌బాబు, జంగం గంగాధర్, సహాయ కార్యదర్శి నన్నేసాబ్, నాయకులు స్వర్ణ, సుకన్య, భూపతి, నల్వల నర్సయ్య, ఎల్లయ్య, సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శిర్ప లింగం, సరిత తదితరులు పాల్గొన్నారు.



