Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీని ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలం

బీజేపీని ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలం

- Advertisement -

‘సర్‌’ పేరుతో ఓట్ల తొలగింపు కుట్రలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్/మరిపెడ

దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు (సర్) ప్రక్రియ పేరుతో లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని, దీనిని బట్టబయలు చేసి అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య విమర్శించారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని పెరమండ్ల జగన్నాథ భవనంలో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు హాజరైన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల, ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక హక్కులపై దాడులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వంటి చర్యల కారణంగా ప్రజలు బీజేపీకి దూరమవుతున్నారని తెలిపారు. పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక ఎన్నికల్లో గెలవడానికి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. సర్ పేరుతో ఇప్పటికే బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయన్నారు. అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గానీ, అధికార కాంగ్రెస్ పార్టీ గానీ ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించకుండా మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభమై రెండు వారాలకు పైగా గడిచినా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలేదని తెలిపారు. చాలా మంది తమ ఓటు స్థితి ఏమిటో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యం లో ఓటు అత్యంత విలువైన హక్కు అని, దానిని కాపాడుకోవ డం ప్రతి పౌరు‌ని బాధ్యత అని తెలిపారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపును సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. దీనిపై గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉద్యమాలు నిర్వహిస్తామని, అవసరమైతే ఎన్నికల కమిషన్ కార్యాలయాల ముట్టడితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజల అసలు సమస్యలను పక్కనబెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం, దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను దెబ్బతీయడం వంటి చర్యలకు పాల్పడుతోందని వీరయ్య అన్నారు. నీట్ పరీక్షల అక్రమాల వంటి కీలక అంశాల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా వారిని కాపాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు, సబ్సిడీలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ సరైన ప్రణాళిక లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు, వ్యవసాయ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి. సాగర్, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మెన్ సోమయ్య ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుణగంటి రాజన్న, అలవాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్, ఆకుల రాజు, కుంట ఉపేందర్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -