Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసామినేని హత్య కేసు 'సాగుతూనే..!'

సామినేని హత్య కేసు ‘సాగుతూనే..!’

- Advertisement -

సీఎం – డీజీపీ చెరో మాట
సిట్ వేస్తామని సీఎం హామీ
స్పెషల్ టీమ్‌ అని డీజీపీ ప్రకటన
ఇప్పటికే 8 నెలలు..
 ఇంకో నెల పొడిగింపు
పొంతన లేని వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) శ్రేణుల ఆగ్రహం
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో స్పష్టత కోసం డిమాండ్

​నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సామినేని రామారావు హత్య కేసు ఇప్పట్లో తేలేలా లేదు. మర్డర్ జరిగి ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతున్నా.. విచారణలో ఎలాంటి పురోగతి లేదు. కాంగ్రెస్ వాళ్లే హత్య చేశారని రామారావు సతీమణి స్వరాజ్యం మొదటి నుంచీ చెప్తున్నా.. ఏకంగా రాష్ట్ర హోం మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పూర్వ డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినా కేసుపై ఇప్పటికీ స్పష్టత లేదు. సామినేని రామారావు హత్య కేసుకు సంబంధించి మొదటి నుంచి విరుద్ధ ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. సీపీ, డీజీపీ, సీఎం.. ఇలా ఎవరికి వారుగా ప్రకటనలు, హామీలు ఇస్తున్నారే తప్ప బాధితులకు న్యాయం దక్కే సూచనలే కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హత్య జరిగిన గతేడాది అక్టోబర్ 30న ఘటనాస్థలిని సందర్శించిన సీపీ సునీల్ దత్ కొద్దిరోజుల్లో.. ఆ తర్వాత నెలరోజుల్లో నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. నెలలు గడుస్తున్నా కనీసం ఏ ఒక్కర్నీ అదుపులోకి తీసుకోలేకపోయారనే విమర్శలు జిల్లా పోలీసులపై ఉన్నాయి. పై పెచ్చు బాధిత కుటుంబ సభ్యులను, రామారావు జీవితాంతం పనిచేసిన సీపీఐ(ఎం) కార్యకర్తలపై నిందలు మోపటం.. విచారణ పేరుతో కొందర్ని అదుపులోకి తీసుకొని హింసకు గురి చేయటం అప్పట్లో చర్చకు దారి తీశాయి. రామారావు కేసును సంబంధంలేని మరో హత్య కేసుతో ముడిపెట్టి విచారణ నిర్వహించటం వంటి చర్యలు జిల్లా పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. కోర్టు అనుమతితో లై డిటెక్టర్ టెస్టుల వరకూ వెళ్లినా ఆ తర్వాత ఏమైందో.. అంతు పట్టడం లేదనే చర్చ సాగుతోంది.

ఖమ్మం జిల్లా పోలీసులు ఈ కేసు విషయంలో ఎలాంటి పురోగతిని చూపకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు, సీపీఐ(ఎం) నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అప్పటి డీజీపీని కలిసి సామినేని కేసు విషయం తేల్చాలని విన్నవించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) తో విచారణ చేయించాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అప్పటి డీజీపీ శివధర్ రెడ్డి సైతం అంగీకరించారు. సీఎం అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చారు. ఇది జరిగి ఇప్పటికీ నెలన్నర రోజులైనా సిట్ కార్యరూపం దాల్చలేదు. ​మంగళవారం నాడు ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన డీజీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. సీఎం ఇచ్చిన హామీకి విరుద్దమైన ప్రకటన చేయటంపై సందేహాలకు తావిచ్చినట్లయింది. ముఖ్యమంత్రి ఆదేశాలు కాకుండా డీజీపీ ఇంకెవరి ఆదేశాలైనా పాటిస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయని సీపీఐ(ఎం) శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎల్ క్లూస్ ఆధారంగా నెల రోజుల్లో కేసును తేల్చుతామని డీజీపీ ఖమ్మం పర్యటనలో స్పష్టం చేశారు. 8 నెలలుగా హంతకులను పట్టుకోలేని ఖమ్మం జిల్లా పోలీసులతోనే టీమ్ ఏర్పాటు చేయటం అంటే.. ఈ హత్యకేసును మరింత జాప్యం చేయటం, పరోక్షంగా హంతకులను కాపాడటమేనని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ అభిప్రాయపడుతోంది. వెంటనే సీట్ ఏర్పాటు చేసి హత్య చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాలి, వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.

సిట్ ఏర్పాటుపై సీఎం పర్యటనలో స్పష్టతివ్వాలి 
నున్నా నాగేశ్వరరావు, సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి
​​జిల్లా పోలీసులతో స్పెషల్ టీమ్ ఆలోచనను డీజీపీ విరమించుకోవాలి. ముఖ్యమంత్రి హామీని అమలు చేయాటానికి సిట్ ఏర్పాటు చేయాలి. లేకుంటే ప్రజాస్వామ్యయుతంగా మా పోరాటం కొనసాగుతుంది. సామినేని రామారావు సొంత మండలంలోనే 10న సీఎం పర్యటన ఉంది. ఈ సందర్భంగా ఆయన ఈ కేసు విషయమై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -