Thursday, May 7, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఇదేనా ట్రాఫిక్‌ ఆపే తీరు?

ఇదేనా ట్రాఫిక్‌ ఆపే తీరు?

- Advertisement -

– ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
– పోలీసు అధికారులపై సీఎం ఆగ్రహం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
”ఇదేం ట్రాఫిక్‌ ఆపుడు, ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా కాన్వాయ్‌ వెళ్తుంటే ఇంత హడావుడి అవసరమా?” అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఆ ప్రాంతంలోనే విపరీతమైన ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. సీఎం కాన్వాయ్‌ వెళ్తున్న మార్గాన్ని క్లియర్‌ చేయడానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. సీఎం కాన్వాయ్‌ వెళ్తున్న మార్గాన్ని ఫ్రీగా వదిలి ఎదురుగా వస్తున్న ట్రాఫిక్‌ను కూడా ట్రాఫిక్‌ పోలీసులు నిలిపివేశారు. ఇది చూసి ముఖ్యమంత్రి విస్మయం చెందారు. తాను వెళ్తున్న మార్గంలో ట్రాఫిక్‌ను ఆపడం సరే, కానీ ఎదురుగా ట్రాఫిక్‌ వెళ్లడానికి అభ్యంతరం ఏమిటనీ ఆయన అధికారులను ప్రశ్నించారు. ఈ విధంగా తనతోపాటు ఇతర వీవీఐపీలు ప్రయాణిస్తున్నప్పుడు ఈ విధంగానే ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపివేస్తే ప్రజలు ఇబ్బందులకు గురికారా? ఈ విషయంలో ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ట్రాఫిక్‌ డైవర్షన్‌ ప్రక్రియను ఎందుకు చేపట్టరని ఆయన అధికారులను నిలదీశారు. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కారాదు? నగరంలోనే కాదు, ఇతర పట్టణ, జిల్లాలలో కూడా ట్రాఫిక్‌ అధికారులు వీఐపీల పర్యటనల సందర్భంగా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా నియంత్రణా చర్యలను చేపట్టాలని ఆయన డీజీపీ సి.వి ఆనంద్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు శంషాబాద్‌ వద్ద ప్రజలను ట్రాఫిక్‌ ఇబ్బందులకు గురి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో ట్రాఫిక్‌ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో డీజీపీ సి.వి ఆనంద్‌ అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు, ఆయా ప్రాంతాల ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులతో హడావుడిగా వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇకపై సీఎంతో పాటు వీఐపీల పర్యటనల సందర్భంగా ఎదురుగా వస్తున్న ట్రాఫిక్‌కు క్లియరెన్స్‌ ఇవ్వాలనీ, ఆ విధంగా ప్రణాళిక చేసుకోవాలని ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. వీవీఐపీల పర్యటనలపై ముందుగానే అప్రమత్తమై, వారు ప్రయాణించే మార్గాలు, చేరుకునే ప్రదేశాల వద్ద ట్రాఫిక్‌ వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అటువైపుగా దారి మళ్లించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కిందిస్థాయి పోలీసు అధికారులేగాక ఉన్నతాధికారులు సైతం రోడ్ల పైకి వచ్చి ట్రాఫిక్‌ నియంత్రణను పర్యవేక్షించాలని ఆయన కోరారు. రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లలో సైతం వీఐపీల పర్యటనల సందర్భంగా ఇవే మార్గదర్శకాలను పాటించాలని డీజీపీ స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలంలో సైతం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ నియంత్రణపై ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకొని అమలుకు సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా భారీ వర్షాలు పడ్డప్పుడు ఏయే మార్గాలు, కూడళ్లలో వర్షపు నీరు నిలుస్తుందో ముందుగా అంచనా వేసి నీటిని దారి మళ్లించడానికి అవసరమైన మార్గాలను స్థానిక మున్సిపాలిటీ అధికారులకు సూచించి వారితో కూడా సమన్వయం కావాలని ఆయన అధికారులను కోరారు. త్వరలోనే అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌సేఫ్టీబ్యూరోను ఏర్పాటు చేస్తున్నామనీ, ఈ బ్యూరో ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌పై వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించి ట్రాఫిక్‌ పోలీసు అధికారులకు మార్గ నిర్దేశన చేస్తుందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నగర పోలీసు కమిషనర్లు సజ్జనార్‌, రమేశ్‌, సుమతిలతో పాటు వివిధ జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, ట్రాఫిక్‌ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

1.56 లక్షల మంది మహిళలు, బాలబాలికలు చైతన్యం మహిళా భద్రతా విభాగం డీజీపీ చారుసిన్హా
రాష్ట్రంలో గత వారం రోజులుగా 1.56 లక్షల మంది మహిళలు, బాలబాలికలను.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై చైతన్యపర్చినట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డీజీపీ చారుసిన్హా బుధవారం తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 90 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, ఇందులో తమ విభాగం మహిళలేగాక బాలబాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ‘బాల్‌పంచాయతీ’లను నిర్వహించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ఆరు జిల్లాల్లో ఆరు గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంచుకొని బాలబాలికలతో బాల్‌పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందనీ, వారి దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను చర్చించి వాటి పరిష్కార మార్గాలను వెతికేలా ప్రణాళికలను రూపొందించి ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ విషయంలో వారికి సహకరించేలా ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డ్‌ కమిటీ సభ్యులకు కూడా మార్గదర్శకాలను సూచించడం జరిగిందని ఆమె చెప్పారు. ఈ ఆరు గ్రామాల్లో తాము చేపట్టిన పైలట్‌ ప్రాజెక్ట్‌ మంచి ఫలితాలను అందించిందని అన్నారు. అలాగే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా 1709 ప్రాంతాల్లో సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యపర్చడం జరిగిందని ఆమె తెలిపారు.

రాష్ట్ర సీజేను కలిసిన డీజీపీ
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ను బుధవారం రాష్ట్ర నూతన డీజీపీ సి.వి ఆనంద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టులోని సీజే ఛాంబర్‌లో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. అలాగే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ పి. శ్యామ్‌ కోషీని కూడా డీజీపీ కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -