Friday, May 8, 2026
E-PAPER
Homeసినిమానిజాయితీపరులైన జర్నలిస్టుల కథ..

నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ..

- Advertisement -

రచయిత, నటుడు పోసాని కష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ అరుణారెడ్డి’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్‌ బాధ్యతలు కూడా ఆయనే వహిస్తున్నారు. హిందోళ చక్రవర్తి, కాజల్‌ శర్మ, ఆయేషా ఖాన్‌, బీజేపీ నేత రఘునందన్‌ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళి మీడియాకి తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ‘ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్‌ క్యారెక్టర్‌లో నటిస్తోంది. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు?, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. అలాంటి జర్నలిస్ట్‌ పరిస్థితి ఏమైంది?, ఓ సీఎం ఆమెను ఎలా ఆదుకుని, ప్రోత్సహించారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్‌ రావు నటించారు. ఈ సినిమాకు పాలిటిక్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ మూవీ స్క్రీన్‌ ప్లే..ఇండియాలోనే ఒక బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్‌లో కూడా ఇది బెస్ట్‌ స్క్రీన్‌ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమాలో ఒక్క బూతు, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు’ అని అన్నారు. ‘పోసాని ఈ కథ చెప్పినప్పుడు అరుణారెడ్డి పాత్రను ఎంతో ఇష్టపడ్డాను. అరుణ ఒక పవర్‌ ఫుల్‌ వుమెన్‌. అరుణ లాంటి అమ్మాయిలు ఇప్పటి సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంది’ అని హీరోయిన్‌ హిందోళ చక్రవర్తి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -